SAKSHITHA NEWS

అభివృద్ధి చేసి సిక్కోలు రుణం తీర్చుకుంటాం వైకాపా ప్రభుత్వ తీరుతోనే జిల్లా వెనుకబాటు తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు

పాతపట్నం నియోజకవర్గం పసుపుమయమైంది.. ప్రధాన దారుల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడింది.. పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లా పర్యటన తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నింపింది..బూర్జ మండలం పాలవలస నుంచి కొత్తూరు వరకు చంద్రన్నపై అడుగడుగునా అభిమానం పూలవర్షమై కురిసింది.. జనం నీరాజనాలు పలికారు.. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గురువారం నాగావళి- వంశధార అనుసంధానం, వంశధార జలాశయ పనులు పరిశీలించారు.

జిల్లా నాయకుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.పర్యటనలో భాగంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వైకాపా పాలనలో జిల్లా వెనుకబాటుతనాన్ని వివరించారు.భవిష్యత్తులో తెదేపా ప్రభుత్వం వస్తే యువత, మహిళలు, రైతులు,ఇతర రంగాల ప్రజలకు ఎలా అండగాఉంటారో తెలియజేశారు.అభివృద్ధికి పాటుపడి సిక్కోలు రుణం తీర్చుకుంటానని హామీ ఇచ్చారు.శ్రీకాకుళం జిల్లా విభజన సరిగ్గా లేదని చంద్రబాబు విమర్శించారు.

భామిని మండలానికి చెందిన పలువురు తమను దూరంగా విసిరేసినట్లు పార్వతీపురం మన్యం జిల్లాలో కలిపారని,అన్ని విధాలుగా అందుబాటులో ఉండే శ్రీకాకుళం జిల్లాలో కలపాలని తెదేపా నేత దృష్టికి తీసుకువచ్చారు.దీనిపై ఆయన మాట్లాడుతూ జిల్లాల విభజన హేతుబద్ధంగా జరగలేదని,ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల విభజనలో లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.వీటన్నింటినీ పరిశీలించి తాము అధికారంలోకి వచ్చిన తరవాత న్యాయబద్ధమైన విభజన జరిగేలా చూస్తామన్నారు. భామిని మండలం శ్రీకాకుళంలోనే ఉండేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.


SAKSHITHA NEWS