Wada Wada Puvwada Program in 38 Division
38 డివిజన్లో వాడ వాడ పువ్వాడ కార్యక్రమం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా రోజు ఖమ్మం నగరంలోని 38వ డివిజన్ ఖిల్లా లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డివిజన్లో గల పూర్వ బావి, రోడ్డు పై ఉన్న ట్రాన్స్ ఫార్మర్ లు, అసంపూర్తిగా ఉన్న సైడ్ కాల్వలు, ఆసరా పెన్షన్ లు, స్మశాన వాటిక తదితర అంశాలపై స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఆయా పనులను తక్షణమే పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి ని ఆయన అదేశించారు. విద్యుత్, త్రాగునీరు, పారిశుధ్యం, గుంతల పూడిక, వృద్ధుల పెన్షన్లు, డ్రెయిన్లు తదితర సమస్యల పరిష్కారంకై సూచనలు చేశారు. అర్హులై ఉండి, చిన్న చిన్న సమస్యలు ఉండి ఆసరా పెన్షన్ పొందలేని వారికి తగు సూచనలు చేసి వారికి పెన్షన్ వచ్చేలా చేయలని మంత్రి అదేశించారు.
ప్రభుత్వం ఎంతో చిత్త శుద్ధితో పేదలకు ఆసరాగా ఉండేందుకు ఆసరా పెన్షన్ ను ఇస్తుంటే ఆయా ఫలాలను అధికారులు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అసంపూర్తిగా ఉన్న సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట కొత్త సైడ్ కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని మున్సిపల్ అధికారులను మంత్రి అదేశించారు.
డివిజన్ మధ్యలో ఉన్న పాత బావి దుర్గంధం వెదజల్లుతూ ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉందని ప్రజల విజ్ఞప్తి మేరకు సమస్య పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
డివిజన్ లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాలను మంత్రి ఈ సందర్భంగా సందర్శించారు. విద్యార్థులకు కనీస సదుపాయాలు, పాఠశాల ఆధునీకరణ కు తన సిడిపి నిధుల నుండి మంజూరు చేస్తానని హామి ఇచ్చారు. పాఠశాల తరగతి భవనం కు రంగులు వేయించి, వాల్ ప్రాజెక్ట్ క్రింద చిత్రాలను వేయించాలని అధికారులకు సూచించారు. వాడ వాడ పువ్వాడ కార్యక్రమానికి మంత్రి కేటిఆర్ రూ.20 కోట్లు మంజూరు చేశారని ఆయా నిధుల నుండి డివిజన్లలో నెలకొన్న పలు సమస్యలకు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతున్నాయా లేదా అని స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మి ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, ఆర్డీవో రవీంద్రనాథ్, మున్సిపల్ అసిస్టెంట్ కమీషనర్ మల్లీశ్వరి, మునిసిపల్ ఇఇ క్రిష్ణ లాల్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, విద్యుత్ డిఇ రామారావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు .