మీ సేవ కేంద్రాల్లో ఓటరు నమోదు సేవలు ఉచితం….

Sakshitha news

మీ సేవ కేంద్రాల్లో ఓటరు నమోదు సేవలు ఉచితం….

–కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి,
భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు వివరాల నమోదును మీ సేవ కేంద్రాల్లో పూర్తిగా ఉచితంగా చేసుకునే అవకాశం కల్పించినట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

విడుదల చేసిన ఒక ప్రకటనలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ప్రజల సౌకర్యార్థం మీ సేవ కేంద్రాల్లో ఓటరు వివరాల నమోదు ప్రక్రియను ఎలాంటి రుసుము లేకుండా నిర్వహించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సేవ కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇంటర్నెట్ సౌకర్యం లేని వారు లేదా స్వయంగా దరఖాస్తు చేసుకోలేని వారు తమ సమీపంలోని మీ సేవ కేంద్రం లేదా బూత్ స్థాయి అధికారిని సంప్రదించి సులభంగా నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఓటర్లు ఓటర్ల సేవల అంతర్జాల వేదిక ద్వారా ఇంటి నుంచే తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వ్యక్తిగత వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, చిరునామా, మొబైల్ నంబర్ తదితర వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అవసరమైన ధ్రువీకరణ పత్రాలను జతచేసి దరఖాస్తు సమర్పించాలని సూచించారు.

దరఖాస్తు సమర్పించిన అనంతరం వచ్చే గుర్తింపు సంఖ్యను తప్పనిసరిగా భద్రపరచుకోవాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని ప్రతి అర్హ ఓటరు గడువులోగా తమ ఓటరు వివరాల నమోదును పూర్తి చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సందేహాలు ఉన్న వారు సంబంధిత బూత్ స్థాయి అధికారులు, ఎన్నికల అధికారులను లేదా సమీపంలోని మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి అవసరమైన సహాయం పొందవచ్చని సూచించారు.