పోలీస్ ఉద్యోగాలే లక్ష్యమైతే ఈ అవకాశాన్ని వదులుకోకండి….
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, : పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో సిద్ధమవుతున్న యువతీ, యువకులు ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పిలుపునిచ్చారు.
తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న ఎస్‌ఐ, కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న పెద్దపల్లి జిల్లా అభ్యర్థుల కోసం నిర్వహించనున్న ‘పోలీస్ యువశక్తి’ ఉచిత శిక్షణ ఎంపిక కార్యక్రమం పోస్టర్‌ను సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అర్హులైన అభ్యర్థులకు నాణ్యమైన ఉచిత శిక్షణ అందించి రాష్ట్ర పోలీస్ నియామకాల్లో పెద్దపల్లి జిల్లా నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఎంపికయ్యేలా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.
ఉచిత శిక్షణ కోసం ఎంపిక ప్రక్రియను జూలై 19 (ఆదివారం) ఉదయం 6 గంటలకు గోదావరిఖనిలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (సీఈఆర్ క్లబ్)లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందుగా శారీరక సామర్థ్య పరీక్ష, అనంతరం రాత పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
పురుష అభ్యర్థులకు 1,600 మీటర్ల పరుగు, మహిళా అభ్యర్థులకు 800 మీటర్ల పరుగు నిర్వహిస్తామని తెలిపారు. ఎంపికైన వారికి అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా ఉచిత శిక్షణ, అధ్యయన సామగ్రి, శారీరక శిక్షణతో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు వెల్లడించారు.
ఈ అవకాశం పెద్దపల్లి జిల్లా అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు జూలై 17, 2026లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ప్రవీణ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
