ఎన్‌టీపీసీ ఈఎస్ఐ డిస్పెన్సరీలో డాక్టర్లు, మందుల కొరత వెంటనే తీర్చాలి….
జాయింట్ డైరెక్టర్ హేమలతకు ఎన్‌టీపీసీ కార్మిక జేఏసీ వినతి….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: రామగుండం, ఎన్‌టీపీసీ టౌన్‌షిప్‌లోని ఈఎస్ఐ డిస్పెన్సరీని సందర్శించిన వరంగల్ ఈఎస్ఐ జాయింట్ డైరెక్టర్ హేమలతకు ఎన్‌టీపీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో డిస్పెన్సరీలో నెలకొన్న సమస్యలపై మెమోరాండం అందజేశారు.
మెమోరాండంలో ప్రధానంగా డిస్పెన్సరీలో డాక్టర్ల కొరత, అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడం, ఇన్‌పేషెంట్ (IP) సేవలు లేకపోవడం, అత్యవసర వైద్య సేవలు పరిమితంగా ఉండడం వంటి సమస్యలను ప్రస్తావించారు. సుమారు 40 వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ డిస్పెన్సరీపై ఆధారపడుతున్నప్పటికీ, సరైన వైద్య సేవలు అందడం లేదని వివరించారు. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, అత్యవసర చికిత్స అవసరమైన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అలాగే ఎన్‌టీపీసీ ఆసుపత్రిలో ఉన్న ఆధునిక వైద్య సదుపాయాలను ఈఎస్ఐ కార్మికులకు అందుబాటులోకి తీసుకురావాలని, డిస్పెన్సరీని 24 గంటల సేవలతో బలోపేతం చేయాలని, అవసరమైన వైద్య సిబ్బంది, మందులు, పరికరాలను వెంటనే సమకూర్చాలని జేఏసీ డిమాండ్ చేసింది.
డిస్పెన్సరీలో నెలకొన్న పరిస్థితులను జేఏసీ నాయకులు జాయింట్ డైరెక్టర్ హేమలతకు వివరించగా, సమస్యలను పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె సానుకూలంగా స్పందించినట్లు కార్మిక నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసంఘటిత కార్మిక వర్గ జిల్లా అధ్యక్షులు హైమద్ బాబా, హెచ్ఎంఎస్ నాయకులు డి. సత్యం, బీఎంఎస్ నాయకులు టి. శ్రీనివాస్, టీయూసీఐ నాయకులు పీ.ఎన్. భూషణ్, కేసీఎంఎస్ నాయకులు సీహెచ్. సత్యం, గోదావరి యూనియన్ నాయకులు రాజమల్లుతో పాటు ఎన్‌టీపీసీ కార్మిక జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
