భూ రీ-సర్వేలో పారదర్శకత పాటించాలి.. ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందాలి….

Sakshitha news

భూ రీ-సర్వేలో పారదర్శకత పాటించాలి.. ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందాలి….

కలెక్టర్ కోయ శ్రీహర్ష….

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:పెద్దపల్లి, జిల్లాలో చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం నిట్టూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యాబోధన, ప్రాథమిక అక్షరాస్యత–సంఖ్యాజ్ఞాన కార్యక్రమం అమలును పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సర్వే నంబర్‌ను వరుస క్రమంలో ఖచ్చితంగా నమోదు చేసి రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో పరిశీలన నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భూ రీ-సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

పాఠశాలల తనిఖీలో భాగంగా విద్యార్థుల అభ్యాస స్థాయిపై ఆరా తీసిన కలెక్టర్, ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలు తప్పనిసరిగా అందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. విద్యా ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలను పూర్తి చేయడంతో పాటు వెనుకబడిన విద్యార్థులకు అదనపు బోధన అందించాలని ఆదేశించారు.

మధ్యాహ్న భోజనం నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ప్రీ-ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మరుగుదొడ్లలో ఎల్లప్పుడూ నీటి సౌకర్యం కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ పర్యటనలో ఏడీ సర్వే సోమేశ్వర్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మయ్య, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజమణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top