సమాజంలో మార్పు రావాలంటే గ్రంథాలయాల అభివృద్ధి అత్యంత అవసరం

Sakshitha news

సమాజంలో మార్పు రావాలంటే గ్రంథాలయాల అభివృద్ధి అత్యంత అవసరం

ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారి జ్ఞాన సమాజం దిశగా సాగాలి : రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణలోనే మొదటి డిజిటల్ లైబ్రరీ వనపర్తిలో ఏర్పాటు చేసుకున్నాం, వనపర్తి లో లైబ్రరీల అభివృద్ధికి ఎల్లప్పుడు సహకరిస్తా: వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి

విద్య అనేది ఎవరు దోచుకోలేని సంపద : రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి

..

సాక్షిత వనపర్తి :
సమాజంలో మార్పు రావాలంటే గ్రంథాలయాల అభివృద్ధి అత్యంత అవసరమని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా గ్రంథాలయంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన మొదటి అంతస్తును ప్రారంభించారు. కార్యక్రమంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి , తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి , జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు గ్రంథాలయ నూతన మొదటి అంతస్తును ప్రారంభించిన అనంతరం సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం అతిథులతో కలిసి కొత్త అంతస్తును పరిశీలించి, గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీతో పాటు గ్రంథాలయ ఆవరణను సందర్శించి అక్కడ కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే గ్రంథాలయాల అభివృద్ధి అత్యంత అవసరమని అన్నారు. ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాలని, కుటుంబ ఖర్చుల్లో కొంత భాగాన్ని పుస్తకాల కొనుగోలుకు వెచ్చిస్తే జ్ఞాన సమాజ నిర్మాణానికి దోహదం అవుతుందని పేర్కొన్నారు.

శాలువాలు, బొకేలకు ఖర్చు చేసే సంస్కృతికి స్వస్తి చెప్పి, ఆ డబ్బుతో పుస్తకాలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రూ.10 లక్షలతో విలువైన పుస్తకాలను కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతామని, శాలువాలు బొకేలకు వెచ్చించే ఖర్చును పుస్తకాలపై పెట్టి వాటిని డొనేషన్ ద్వారా గ్రంథాలయాలకు అందించే కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు.

సాంస్కృతిక శాఖ ద్వారా గ్రంథాలయ అభివృద్ధికి రూ.1 కోటి నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే పుస్తకాల కొనుగోలుకు రూ.10 లక్షలు కేటాయిస్తామని వెల్లడించారు. వనపర్తి విద్యకు నిలయంగా పేరొందిందని, ఇక్కడ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విద్యా, క్రీడా రంగాలకు అధికంగా నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రంథాలయ మొదటి అంతస్తును ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. వనపర్తికి “చదువుల పర్తి”గా ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు. గ్రంథాలయంలో అనేక ఆధునిక సౌకర్యాలు కల్పించామని, తెలంగాణలో తొలి డిజిటల్ లైబ్రరీని వనపర్తిలోనే ప్రారంభించామని పేర్కొన్నారు.

వనపర్తిలో అన్ని రకాల ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయని, నవోదయ విద్యాలయాన్ని కూడా తీసుకురావడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తిలోనే చదువుకున్నారని, విద్యాభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తున్నారని అన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖల నుంచి చెరో కోటి రూపాయల నిధులు కేటాయించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు. అలాగే లైబ్రరీ వద్ద హైమాస్ట్ లైట్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. వనపర్తి చరిత్రను ప్రస్ఫుటించే విధంగా లైబ్రరీలను అభివృద్ధి చేసుకుందామని తెలియజేశారు.

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ యువత అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఖాళీ సమయంలో పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని, గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాల కల్పనకు జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఫర్నిచర్ ఏర్పాటుకు కూడా సహకారం అందిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతూ వనపర్తి అంటేనే “విద్యపర్తి”గా ప్రసిద్ధి చెందిందన్నారు. ఉమ్మడి జిల్లాలోని అనేక మంది విద్యార్థులు వనపర్తికి వచ్చి చదువుకునేవారని గుర్తుచేశారు. ఇంత మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. డబ్బును దోచుకోవచ్చు కానీ చదువును ఎవరూ దోచుకోలేరని అన్నారు. గ్రంథాలయానికి మంచి పుస్తకాలను తాను డొనేట్ చేస్తానని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వనపర్తిలో గ్రంథాలయ సంస్థ మొదటి అంతస్తు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. పబ్లిక్ రీడింగ్ రూమ్ లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ మాట్లాడుతూ గ్రంథాలయంలో డైనింగ్ హాల్ సహా ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని మంత్రిని కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ లైబ్రరీకి రోజు 300 నుంచి 400 మంది విద్యార్థులు చదువుకోడానికి వస్తుంటారని వారికి సౌకర్యాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. అదేవిధంగా కొత్త మండలాల్లో కూడా లైబ్రరీలో ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.

సమావేశంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాద్, వనపర్తి మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top