నకిలీ పత్తి విత్తనాలపై పోలీసుల ఉక్కుపాదం…
30 కిలోల విత్తనాల స్వాధీనం.. నలుగురు నిందితుల అరెస్టు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,
రైతులను మోసం చేస్తూ నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న నిందితులపై తాండూర్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, తాండూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేవయ్య పర్యవేక్షణలో తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
రెచ్చిని గ్రామ శివారులోని బ్రిడ్జి సమీపంలో రొళ్లపాడు ప్రాంతం నుంచి నకిలీ పత్తి విత్తనాలను బైక్‌పై తరలించి విక్రయిస్తున్నారనే సమాచారం అందడంతో తాండూర్ ఎస్సై కె. ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కొండ్లే సుష్మ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా బైక్‌పై సంచిలో తరలిస్తున్న సుమారు 30 కిలోల నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో రొళ్లపాడు, రెచ్చిని గ్రామాలకు చెందిన గోగర్ల మల్లేష్, ముక్క శ్రీకాంత్, గాండ్ల మహేష్, పిడుగు లక్ష్మణ్ అనే నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
విచారణలో ఈ నకిలీ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుమలశెట్టి రామకృష్ణ సరఫరా చేస్తున్నట్లు వెల్లడైనట్లు తెలిపారు. అతడు మల్లేష్ ద్వారా మోటార్‌సైకిల్‌పై విత్తనాలను తరలించి స్థానిక రైతులకు అందజేస్తుండగా పట్టుబడినట్లు పేర్కొన్నారు.
నకిలీ పత్తి విత్తనాల వినియోగం వల్ల భూమి సారవంతత తగ్గిపోవడంతో పాటు పంట దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఏసీపీ హెచ్చరించారు. గ్లైఫోసేట్ కలిగిన నకిలీ విత్తనాల వాడకం రైతుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు.
రైతులు తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే కొనుగోలు చేయాలని, లైసెన్సు కలిగిన ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తీసుకోవాలని సూచించారు. దళారుల మాటలు నమ్మి నకిలీ విత్తనాల బారిన పడవద్దని హెచ్చరించారు.
గ్రామాల్లో ఎక్కడైనా నకిలీ విత్తనాల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేవయ్య, మండల వ్యవసాయ అధికారి కొండ్లే సుష్మ, ఎస్సై ప్రసాద్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

