నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి….

Sakshitha news

నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి….

అనర్హులు, నకిలీ జర్నలిస్టులను పరిగణలోకి తీసుకోవద్దు….

–జెఎస్ఎస్ నాయకులు…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
పెద్దపల్లి జిల్లాలో నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తూ అర్హులైన వారికి మాత్రమే అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం (జెఎస్ఎస్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బందుల రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు వెన్నంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అరుణశ్రీకి వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ, జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిజంతో ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు అక్రిడేషన్ కార్డులు పొందుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ రేషన్ డీలర్లు, వ్యాపారులు వంటి అనర్హులు కూడా అక్రిడేషన్ కార్డులు పొందుతున్నారని, ఇందుకు భారీ మొత్తాల్లో డబ్బులు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న నిజమైన జర్నలిస్టులు నష్టపోతున్నారని అన్నారు.

అక్రిడేషన్ కార్డుల మంజూరులో పారదర్శకత పాటించాలని, దరఖాస్తుదారుల వివరాలపై క్షుణ్ణంగా విచారణ నిర్వహించి వాస్తవంగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్న వారికే గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. ఫీల్డ్‌లో పనిచేయని నకిలీ జర్నలిస్టులను గుర్తించి అక్రిడేషన్ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

కొంతమందిపై క్రిమినల్, బ్లాక్‌మెయిల్ కేసులు ఉన్నప్పటికీ వారికి అక్రిడేషన్ కార్డులు ఉండటం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న నిజమైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జెఎస్ఎస్ మాజీ జాతీయ కార్యదర్శి సబ్బితం లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శులు వోడ్నాల లత, కన్నూరి రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి వోడ్నాల తిరుపతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రఘు, ఉపాధ్యక్షులు రావుల రాజకుమార్, ప్రచార కార్యదర్శి అనిల్, జిల్లా కోశాధికారి ఉమేష్, లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top