SAKSHITHA NEWS


Tribute to the immortal

అమరజీవికి ఘన నివాళి


సాక్షిత కాకినాడ : అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాల కనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల ప్రగతితో అభివృద్ది పధంలో నిలిపేందుకు సమిష్టిగా కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జిల్లా ప్రజలను కోరారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం పురస్కరించి స్థానిక రామారావుపేట సిబియం సెంటరులోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద జిల్లా స్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపి వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా ఎస్పి యం రవీంద్రనాథ్ బాబులు ముఖ్య అతిధులుగా హాజరై అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు అలంకరించి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీస్ గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ మహనీయుడు పొట్టి శ్రీరాములు చేసిన పోరాటం నిరుపమానమైనదన్నారు.

మహాత్మా గాంధీ అనుచరుడిగా గాంధేయ మార్గంలో ఆయన 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అమరులైయ్యారని, ఆయన మరణించిన 3 రోజుల్లోనే అప్పటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును ప్రకటించారన్నారు. పొట్టి శ్రీరాములు నిస్వార్థ ఆత్మ త్యాగంతో 1953 అక్టోబరు 1 వ తేదీన కర్నూలు రాజధానిగాను, తదుపరి తెలుగు భాష మాట్లాడే ప్రాంతలను కలిపి 1956 నవంబరు వ తేదీ నుండి హైదరాబాదు రాజధానిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిందన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం 2014 జూన్ 2 నుండి నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పటైందన్నారు. రాష్ట్ర సత్వరాభివృద్ది సాధనలో ప్రజలందరం సమిష్టిగా భాగస్వాములౌదామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా కొరారు.
కాకినాడ ఎంపి వంగా గీత మాట్లాడుతూ తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన నిస్వార్థ ప్రాణ త్యాగాన్ని తెలుగు జాతి ఎన్నటికీ మరువదన్నారు.

రాష్ట్ర విభజన జరిగినా నిరాశ పడనవసరం లేదని, భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలు ఉన్న ఘనత తెలుగు మాట్లాడే ప్రజలకు మాత్రమే ఉందన్నారు. మహనీయుడు పొట్టి శ్రీరాములు నిరుపమాన త్యాగానికి ప్రతీకగా రాష్ట్ర అవతరణ దినాన్ని నవంబరు-1వ తేదీనే నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారన్నారు.

అమరజీవి ఆకాంక్షల కనుగుణంగా, జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేత్కర్, బాబూ జగ్జీవనరామ్ ఆశయాల బాటలో రాష్ట్రం ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అందరికీ విద్య, ఆరోగ్యం అందిస్తూ, అభివృద్ది, సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ డిబిటి ద్వారా వారికి నేరుగా అందజేస్తోందన్నారు.


ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ప్రఖర్ జైన్, అయ్యారక కార్పొరేషన్ చైర్పర్సన్ ఆవాల రాజేశ్వరి, అడిషనల్ ఎస్పి పి శ్రీనివాస్, జడ్పి సిఈఓ ఎన్వివి సత్యన్నారాయణ, కాకినాడ మున్సిపల్ కమీషనర్ కె రమేష్, కాకినాడ ఆర్డిఓ బి వెంకటరమణ, డిఎస్పిలు, పలువురు జిల్లా అధికారులు, నగర ప్రముఖలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS