గ్రామపంచాయతీ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే.!
రాష్ట్రంలో గ్రామపంచాయతీలకు ఎన్నికలు ఇప్పట్లో లేనట్టేనా
అంటే అవును అనే అంటున్నారు. మరి గ్రామాల్లో పాలన ఎలా.
సర్పంచ్‌ల ప్లేస్‌లో ఎవరిని నియమిస్తారు.
సర్పంచ్‌లకు ఉన్న చెక్ పవర్‌ను ఎవరికి ఇస్తారు గ్రామాల్లో పాలనను ఎవరు కొనసాగిస్తారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం పంచాయతీ రాజ్ అధికారులపై ఉన్నది అయితే వచ్చే నెల 1వ తేదీతో ఇప్పుడు ఉన్న సర్పంచ్‌ల పదవికాలం ముగుస్తుంది మరి మరికొన్ని రోజులు సర్పంచ్‌ల పదవికాలాన్ని కొనసాగిస్తారా లేక ప్రత్యేక అధికారులను నియమిస్తారా.
వచ్చే నెల 1వ తేదితో సర్పంచ్‌ల పదవి కాలం ముగుస్తుంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహణ కష్టం అని భావిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఎన్నికల నిర్వహణకు కనీసం 3 నెలల సమయం కావాలి అంటున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు. కానీ అంత సమయం లేకపోవడంతో ఈ సర్పంచ్‌ల పదవి కాలాన్ని పొడిగిస్తారా లేక ప్రత్యేక అధికారి పాలన పెడతారా అనేది స్పష్టం చేయడం లేదు ప్రభుత్వం. గ్రామాల్లో ఉన్న సమస్యలు, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తాం అని చెప్పిన 6 గ్యారెంటీలు ఎలా.? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామ పంచాయితీ సర్పంచ్‌లు. మరోవైపు గ్రామసభలు పెడితే 6 గ్యారెంటీలతో పాటు, ఇతర హామీలపై ప్రభుత్వాన్ని, అధికారులను ఎక్కడ నిలదీస్తారో అని ఎన్నికలను వాయిదా వేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అని అంటున్నారు గ్రామ సర్పంచ్‌లు.
సర్పంచ్‌ల పదవికాలం ముగియడంతో గ్రామ పంచాయితీ చెక్ పవర్ ఎవరికి ఇస్తారో అనేది ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఆయితే ఎంపిడిఓతో పాటు గ్రామ కార్యదర్శికి ఇస్తారా.. లేక ఎమ్మార్వో, పంచాయతీ రాజ్ ఇంజనీర్‌లకు ప్రత్యేక బాధ్యతలు ఇస్తారా.. అదీకాక 4 గ్రామాలకు ఒక్క మండల స్థాయి అధికారిని ఇంచార్జిగా నియమించి వారికే చెక్ పవర్ ఇస్తారా.? అనే అంశం ఇంకా తేలాల్సి ఉంది. అయితే గతంలో 4,5 గ్రామాలకు ఒక్క మండల స్థాయి అధికారిని నియమించి గ్రామ కార్యదర్శికి చెక్ పవర్ ఇచ్చారు. ఈసారి కూడా గతం మాదిరిగానే చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా.. సమయానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. ఈసారి కూడా అదే తరహా వ్యవహరిస్తోంది అంటున్నారు సర్పంచ్‌లు. అసలే గ్రామాల్లో రైతులకు రైతు బంధు అమలు చేయలేదు. ఎన్నికల్లో గెలవగానే 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాం అని చెప్పిన సీఎం ఇప్పటివరకు దానిపై సమీక్ష జరపలేదు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా రైతాంగం కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో ఎన్నికలను నిర్వహిస్తే గెలువం అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ప్రత్యేక అధికారి పాలన తేవాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. గ్యారెంటీలు అమలు చేసి కొన్ని పథకాలు లబ్ధిదారులకు అందించాక గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతే లాభం చేకూరుతుంది అని భావిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం.
ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ సర్పంచ్‌లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు. అంతేకాదు గ్రామాల్లో బీఆర్ఎస్‌కు బలమైన క్యాడర్ ఉంది. ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళ్తే బీఆర్ఎస్‌కు మేలు జరుగుతుందని అని అంటున్నారు. అందుకే ప్రత్యేక అధికారి పాలన పెట్టి గ్రామాల్లో కొన్నైనా హామీలు అమలు చేసి ఎన్నికల్లోకి వెళ్లాలని భావిస్తోంది అని సమాచారం. అందుకే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరిస్తోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.