The previous by-election in November
నవంబర్ లో మునుగోడు ఉప ఎన్నిక
▪️ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సీఎం కేసీఆర్
హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు అక్టోబరులో రావచ్చని, నవంబరులో ఎన్నిక జరగవచ్చని, తెరాస సర్వసన్నద్ధంగా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. మునుగోడు ఉప ఎన్నికపై ప్రగతిభవన్‌లో మంగళవారం ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులతో సమీక్షించారు.
మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, చిరుమర్తి లింగయ్య, గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘‘ఉప ఎన్నికను ప్రోత్సహించిన భాజపా ఇప్పుడు భయపడుతోంది. అక్టోబరు మొదటివారంలో నోటిఫికేషన్ వస్తుందని, నవంబరులో ఎన్నిక జరుగుతుందని తెలుస్తోంది. ఎన్నిక నేడో, రేపో అన్నట్లుగా తెరాస పనిచేయాలి. దళితబంధుపై ఊరూరా ప్రచారం చేయాలి.
మునుగోడులోనూ 500 మందిని ఎంపిక చేయాలి. గిరిజన రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో ఇవ్వనున్నాం. గిరిజన బంధునూ ప్రారంభించబోతున్నాం. వీటిపై గిరిజనుల ఇంటింటికీ తిరిగి వివరించాలి. మునుగోడులోని గిరిజనులను రోజుకో వెయ్యి మందిని హైదరాబాద్ తీసుకొచ్చి ఆత్మగౌరవ భవనాలను చూపించాలి. ఆతిథ్యం ఇచ్చి పంపించాలి. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు, వనభోజనాలు ఏర్పాటు చేయాలి.
కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు సంబురంలా సాగాలి. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలి. నాయకులు వ్యక్తిగత రాగద్వేషాలు వదిలి తెరాస గెలుపే ధ్యేయంగా సాగాలి. ఇప్పటికే రెండు గ్రామాలకో ఎమ్మెల్యేను ఇన్‌ఛార్జిగా వేశాం. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చాక చండూరులో సభ నిర్వహిద్దాం. అన్ని సర్వేల్లో తెరాస ప్రథమ, కాంగ్రెస్ రెండో స్థానంలో ఉన్నాయి. భాజపాకు మూడో స్థానమే గతి’’ అని సీఎం పిలుపునిచ్చారు.