మహమ్మదీయ కళాశాలపై కక్ష సాధింపు సరికాదు
— ట్రాక్టర్ కొనుగోలుకు 6 లక్షలు చెల్లించాము
— 50 లక్షలు కావాలంటూ బారుగూడెం సర్పంచ్ వేధింపులు
— విలేకరుల సమావేశంలో మహమ్మదీయ కళాశాల ప్రిన్సిపాల్ ఆవేదన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం రూరల్ మండలం, బారుగూడెంలో మహమ్మదీయ ఎడ్యుకేషనల్ సొసైటీచే నిర్మించిన కళాశాలకు సంబంధించిన ఆస్తి పన్నును 6 లక్షల రూపాయలను బారుగూడెం గ్రామపంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు విషయమై చెల్లించడం జరిగిందని, అయినా కూడా 50 లక్షలు కావాలంటూ బారుగూడెం సర్పంచ్ పల్లెర్ల పాండయ్య వేధింపులకు గురిచేస్తున్నాడని ఆ కళాశాల ప్రిన్సిపాల్ డి జీవన్ మణిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కళాశాల నిర్మాణ సమయంలో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ కొనుగోలు కోసం 6 లక్షలు చెల్లించామని, మిగతా సొమ్ము మాఫీ చేస్తామని డిసెంబర్ 23, 2019న గ్రామపంచాయతీ తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరిగిందన్నారు. దానికి సంబంధించిన పత్రాలు మా వద్ద ఉన్నాయని తెలిపారు. పన్ను చెల్లింపు విషయం ఆనాటితోటే ముగిసిందని, కానీ తమకు 50 లక్షలు కావాలంటూ నిత్యం వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. తమ కళాశాల ప్రహరీ గోడను కూల్చివేస్తామని, కళాశాలకు వచ్చే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, తమ సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. జి ప్లస్ ఫోర్ భవన నిర్మాణానికి ఆనాడే పన్నులు చెల్లించడం జరిగింది. కానీ ఒకే ఒక్క భవనానికి జి ప్లస్ టు, మిగతా భవనాలకు జి ప్లస్ వన్ పరిధిలో మాత్రమే నిర్మాణం చేపట్టడం జరిగిందని అన్నారు. జి ప్లస్ ఫోర్ నిర్మాణం చేపట్టనప్పటికీ అక్రమ వసూళ్లకు పాల్పడేందుకు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వెలిబుచ్చారు. దీనిని మనసులో పెట్టుకొని తమ కళాశాల ప్రహరీ పక్కన ఉన్న హరితహారం మొక్కలు తొలగించారని, ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో తమపై తప్పుడు కేసులతో బనాయిస్తున్నారన్నారు. ఇదే అంశంపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. సర్పంచ్ మరికొందరు వ్యక్తులు తమపై చేసే వేధింపులను అరికట్టాలని, విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కళాశాల అధ్యాపకులు ఎస్ సుధాకర్ పాల్గొన్నారు.