వైసీపీ పార్టీ పెద్దలు కాంగ్రెస్ నుండి మరలా సొంత గూటికి చేరు కున్న ..ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏ సీటు హామీ ఇచ్చారు ? సత్తెనపల్లి అసెంబ్లీనా ? గుంటూరు ఎంపీనా ?…మరో నాలుగు రోజుల్లో తేలనున్న సీట్ల పంచాయతీ..
కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్లీ వైఎస్ఆర్‌సీపీకి తిరిగి వచ్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
మంగళగిరి కాకపోతే మరో నియోజకవర్గం సీటు ఆఫర్ ఇవ్వడంతోనే ఆయన తిరిగి వచ్చారని చెబుతున్నారు.
మంగళగిరిలో ఖచ్చితంగా బీసీ సామాజికవర్గం అభ్యర్థికే టిక్కెట్ ఇస్తారు.
ప్రస్తుత ఇంచార్జ్ గంజి చిరంజీవా లేకపోతే మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలనా అన్నది మరో నాలుగైదు రోజుల్లో ప్రకటిస్తారు.
ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎక్కడ పోటీ చేస్తారన్నది కూడా అప్పుడే ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
పోటీకి వెనుకడుగు వేస్తున్న గుంటూరుకు ప్రకటించిన ఎంపీ అభ్యర్థి
గుంటూరు లోక్‌సభ సమన్వయకర్తగా ఉమ్మారెడ్డి వెంకట రమణను ఎంపిక చేశారు. ఆయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు. ఇంచార్జ్‌గా నియమంచిన చాలాకాలం తరువాత జిల్లాకు వచ్చారు. జిల్లా కో ఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి జిల్లాలోని ముఖ్యనాయకులకు పరిచయం చేశారు. ఆ తరువాత ఆయన మళ్లీ ఎక్కడా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయన్ను మారుస్తారని ప్రచారమైంది. గతంలో క్రికెటర్ అంబటి రాయుడు పార్టీలో చేరినకొద్ది రోజులకే నిష్క్రమించినట్టుగానే వెంకట రమణ కూడా పోటీకి ఆసక్తి చూపడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారమవుతోంది. తాజా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని గుంటూరు లోక్‌సభ సమన్వయకర్తగా ఎంపిక చేస్తారని గురువారం కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
పలు నియోజకవర్గాలపై మార్పు చేర్పుల కసరత్తు
2019లో గుంటూరు ఎంపీగా ఆళ్ల బంధువు అయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేశారు. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు అంగీకరించికపోతే పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు చాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తెనాలిలో తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మార్పుపై దృష్టి సారించలేదు. అయితే ఆకస్మికంగా సినీ నిర్మాత దాసరి కిరణ్ తెనాలి స్థానం కోరడంతో శివకుమార్‌ను పొన్నూరు వెళ్లాలని పార్టీ అధిష్టానం సూచించిందని చెబుతున్నారు. గురువారం పొన్నూరు మండలం వెల్లలూరులో కాపుల ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గుంటూరు లోక్‌సభకు తన కుమారుడు వెంకటరమణ, పొన్నూరుకు తన అల్లుడు ఎమ్మెల్యే రోశయ్య పేర్లు ప్రస్తావించకుండా మనం అంతా ఐక్యంగా ఉండి వైసిపిని గెలిపించుకుని, వైఎస్ జగన్‌ను మరోసారి సిఎం చేసుకోవాలని అన్నారు.
సత్తెనపల్లికి కూడా ప్రచారంలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు
తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరును సత్తెనపల్లికి కూడా పరిశీలిస్తున్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబును బందరు లోక్‌సభకు పంపుతారని అంటున్నారు. ఆయనకు ఇష్టం లేకపోతే పొన్నూరు నుంచి అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు. సత్తెనపల్లిలో పోటీ చేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది.