వచ్చే నెలలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.
MCHRD లో గణేష్ నవరాత్రుల ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి లతో కలిసి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్ది, MLC లు ప్రభాకర్ రావు, సురభి వాణిదేవి, MLA దానం నాగేందర్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణారావు, MAUD స్పెషల్ CS అరవింద్ కుమార్, ట్రాన్స్ పోర్ట్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, వాటర్ వర్క్స్ MD దాన కిషోర్, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, TSSPDCL MD రఘుమారెడ్డి, లా అండ్ ఆర్డర్ అడిషనల్ DG సంజయ్ జైన్, హెల్త్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్ లు అనుదీప్ దురిశెట్టి, హరీష్, అమయ్ కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, ఇరిగేషన్ CE ధర్మా, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యదర్శి భగవంతరావు, బాలాపూర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ YMCA గణేష్ ఉత్సవ కమిటీలతో పాటు వివిధ గణేష్ ఉత్సవ మండపాల కమిటీల సభ్యులు రామరాజు, ప్రభాకర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ లు CV ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, కల్చరల్ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ GHMC పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలకు దేశంలోనే హైదరాబాద్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని తెలిపారు.
ప్రధానంగా ఖైరతాబాద్ లో నిర్వహించే అతిపెద్ద విగ్రహ నిమజ్జనాన్ని లక్షలాది మంది ప్రత్యేకంగా వీక్షిస్తారని చెప్పారు. అదేవిధంగా బాలాపూర్ వినాయకుడి శోభాయాత్ర అనంతరమే మిగతా మండపాల నుండి శోభాయాత్ర ప్రారంభం అవుతూ వస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి గడిచిన 9 సంవత్సరాల లో ప్రతి ఏటా గణేష్ నవరాత్రులతో పాటు బోనాలు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, బతుకమ్మ, రంజాన్, బక్రీద్, క్రిస్మస్, వంటి అన్ని పండుగలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తూ అన్ని వర్గాల ప్రజా ఆచారాలు, సాంప్రదాయాలను గౌరవిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇవే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ స్తిరపడిన వారి ఆచారాలను కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. హిందూ ఆచారం లో ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు.
పండుగలను ప్రజలు గొప్పగా జరుపుకోవాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రాయు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించే గణేష్ ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు. విగ్రహాల నిమజ్జనం కోసం వివిధ చెరువులు, GHMC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాండ్స్ ల వద్ద కూడా అన్ని ఏర్పాట్లను చేయడం జరుగుతుందని చెప్పారు. విగ్రహాల శోభాయాత్ర నిర్వహించే అన్ని రహదారులను అభివృద్ధి, మరమ్మతులు చేపట్టడం, లైటింగ్ ఏర్పాటు, చెట్ల కొమ్మలు ఎక్కడా అడ్డుగా లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇందుకు వివిధ జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బందిని నియమించడం జరుగుతుంది అన్నారు. నవరాత్రులు ముగిసే వరకు పలు ప్రాంతాలలో ట్రాపిక్ ఆంక్షలు విధించడం జరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా వివిధ శాఖల సమన్వయం కోసం కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. విద్యుత్ సరఫరా లో ఎక్కడ కూడా అంతరాయం ఏర్పడకుండా చూసేందుకు ప్రత్యేకంగా ట్రాన్స్ ఫార్మర్ లను అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అవసరమైన అన్ని ప్రాంతాలలో లైటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.
అదేవిధంగా నిమజ్జన ప్రాంతాలు, శోభాయాత్ర నిర్వహించే ప్రాంతాలలో భక్తులకు త్రాగునీటిని అందించేందుకు వాటర్ వర్క్స్ విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాలు, సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పారిశుధ్య నిర్వహణ కోసం GHMC అదనపు సిబ్బందిని నియమించి రౌండ్ డ క్లాక్ విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రజలకు GHMC, HMDA, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. చివరి నిమజ్జనం రోజు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందని అన్నారు. ఏర్పాట్ల విషయంలో ఉత్సవాల నిర్వహకులు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వినాయకుడి పూజకు అవసరమైన 21 రకాల పత్రి అందుబాటులో ఉండటం లేదని, పలువురు ఉత్సవాల నిర్వహకులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన మంత్రి అటవీశాఖ అధికారులతో సంప్రదించి పత్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విగ్రహాలను నిమజ్జనం కోసం తీసుకెళ్ళే వాహనాలను కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని అన్నారు. మన పండుగలకు ఎంతో విశిష్టత ఉందని, అనేక పండుగలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయని, మనకెంతో గర్వకారణం అన్నారు.