SAKSHITHA NEWS

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

తహశీల్దార్లు పెండింగ్ ముటేషన్లపై వెంటనే చర్యలు చేపట్టి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి తహసీల్దార్లతో ముటేషన్లు, డొంకల రక్షణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెండింగ్ ముటేషన్ల విషయంలో చర్యలు వేగవంతం చేయాలన్నారు. సేల్, గిఫ్ట్, సక్సేషన్ తదితర కేటగిరీల వారిగా పెండింగ్ కు కారణాలు సమర్పించాలన్నారు. సేల్, గిఫ్ట్ లలో కోర్ట్ ఆర్డర్, ఇతరత్రా కారణాలు తెలుపాలన్నారు. ప్రతి పెండింగ్ లావాదేవీకి కేటగిరీ వారిగా కారణాలతో నివేదిక సమర్పించాలన్నారు. డొంకల ఆక్రమణల తొలగింపుపై చేపట్టిన చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణీకరణ, అభివృద్ధి చెందుతున్న దృష్ట్యా ఆక్రమణల విషయంలో అలసత్వం వహిస్తే, భవిష్యత్తులో తొలగింపుకు సమస్యలు వస్తాయన్నారు. డొంకల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ప్రస్తుతం సాగునీరు, విద్యుత్ కు ఎటువంటి కొరత లేనందున గతంలో ఖాళీగా ఉన్న భూములన్నీ సాగుభూములుగా మారాయని, డొంకల ఆక్రమణలతో కొందరు రైతులకు పొలాలకు వెళ్ళడానికి ఇబ్బందులు కలుగుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత సమయం ఎంతో కీలకమని, పంటలు ఉన్నచోట కోతలు కాగానే, ఆక్రమణల తొలగింపు చేసి, రోడ్ల ఏర్పాటు చేసి, వాడుకలో తేవాలని కలెక్టర్ అన్నారు. ప్రతి వారం సమీక్ష చేసి ఆక్రమణల తొలగింపుపై పర్యవేక్షణ చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, ఆర్డీవోలు, ఎడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS