సాక్షిత వరంగల్ : గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె..శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు..
అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్.ఎన్.నగర్ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్, నిత్యావసరాలను బాధితులకు ఆమె పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. సాయమందేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులను తమిళిసై పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ”భారీ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.” అని తమిళిసై అన్నారు..