SAKSHITHA NEWS

మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఫోటోనే

ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి కృషి

మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

……..

సాక్షిత : మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేసేది ఒక్క ఫోటో మాత్రమేనని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫి దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం మెదక్ జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెదక్ పట్టణం ద్వారక గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కెమెరాని కనుగొన్న లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫొటోలు తీయడం అద్భుత కళ అని అన్నారు. సమాజ అభివృద్ధిలో ఫొటోగ్రాఫర్ల పాత్ర కీలకమని కొనియాడారు. ప్రతి సన్నివేశాన్ని గుర్తుండిపోయేలా ఫోటో గ్రాఫర్లు తీసిన ఫోటోలు భావితరాలకు మధురమైన స్మృతులుగా మిగిలిపోతున్నాయన్నారు. మనం
ఏ కార్యక్రమం చేపట్టిన ఫోటోగ్రాఫర్ ఉండడం ఎంతో ముఖ్యంగా మారిపోయిందన్నారు. ఫోటోగ్రాఫర్ వృత్తి అనేది ఒక గొప్ప కళ అని కొనియాడారు. సమాజంలో ఫోటోగ్రాఫర్లకు మంచి గుర్తింపు ఉందన్నారు. ఫోటోగ్రాఫర్లు తీసే ఒక్క ఫోటో ప్రభుత్వాన్నే ఆలోచింపజేస్తుందన్నారు. ప్రస్తుత పోటీని తట్టుకుని నిలబడాలంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కోరిక మేరకు త్వరలోనే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ఎప్పుడు ఎలాంటి సమస్య వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు. ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు. అంతకుముందు పాత కెమెరాల ప్రదర్శన, అలాగే కొత్త కెమెరాల వినియోగం గురించి దృశ్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. వజ్రోత్సవాల్లో భాగంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. జూనియర్ కళాశాల నుంచి వెల్కమ్ బోర్డు వరకు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.వెంకటేశ్వర్ రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, డైట్ ప్రిన్సిపల్ రమేష్ బాబు, తెరాస పట్టణ అధ్యక్షులు గంగాధర్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నర్సింలు, ఫోటో వీడియో గ్రాఫర్ లు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS