SAKSHITHA NEWS

Suicide is not the solution to problems, face the problem with courage – District SP Shri P Joshua IPS

కృష్ణాజిల్లా మచిలీపట్నం

ఆత్మహత్యలే సమస్యలకు పరిష్కారం కాదు, ధైర్యంగా సమస్యను ఎదుర్కోండి – జిల్లా ఎస్పీ పి జాషువా ఐపీఎస్

సమస్య ఉంటే దాని పరిష్కారం కూడా వెన్నంటే ఉంటుందని నిశితంగా ఆలోచించి,సమయస్ఫూర్తిగా వ్యవహరించినప్పుడే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోగలమని అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం”ను పురస్కరించుకుని జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ అన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ల అధ్వర్యంలో స్థానిక మచిలీపట్నంలోని వేడుక ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ పి జాషువా ఐపీఎస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్పీ తో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీ ఎన్ వెంకట రామాంజనేయులు , పోలీస్ అధికారులు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ వారు, మెడికల్ అసోసియేషన్ సభ్యులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో SP మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా చాల మంది చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. నిత్య జీవితంలో సమస్యలు వస్తుంటాయి. వాటికి అధైర్యపడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సమస్యలకు పరిష్కారం బలాన్మరణం కాదనే విషయాన్నీ గమనించాలని తెలియజేసారు.పోలీస్ శాఖ పరంగా గమనిస్తే నమోదవుతున్న కేసుల్లో అధిక శాతం ఆత్మహత్యలకు సంబంధించిన కేసులే ఉంటున్నాయని, ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన రాగానే మనకోసం అహర్నిశలు కష్టపడి పెంచి పోషించిన తల్లిదండ్రులను , వారు మన కోసం పడే కష్టాన్ని గుర్తు తెచ్చుకోవాలి.ఈ జీవితంలో మా తల్లిదండ్రులకు, గ్రామానికి, సమాజానికి ఏం చేసామనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. నిరంతరం శారీరక వ్యాయామం, క్రీడలపై మక్కువ మంచి పుస్తక పఠనం ద్వారా ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉంటాయని, అలాగే మంచి స్నేహితుడు మన జీవితంలో ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించడం సులభం అవుతుందని, ప్రతి ఒక్కరూ మంచి నడవడిక కలిగి ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆశిస్తున్నానని, సెల్ఫోన్తో సమయం గడిపే కన్నా తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో సమయం గడిపితే మానసిక ప్రశాంతత దొరుకుతుందని విద్యార్థులతో అన్నారు.

డిస్టిక్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పి.ఎస్.ఆర్.వి ప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు మనపై పెట్టుకున్న ఆశలను చిదిమి వేస్తూ, క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని, మన లక్ష్యం ఉన్నత శిఖరాల వైపు ఉంటే ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయని, సెల్ ఫోన్స్, సామాజిక మాధ్యమాల వినియోగం వంటి వాటిని తగ్గించుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకునేలా గడపాలని తెలిపారు.

గవర్నమెంట్ హాస్పిటల్ సైకియాట్రిస్ట్ ప్రభు రాం మాట్లాడుతూ ప్రపంచ గణాంకాలను పరిశీలిస్తే ఒక సంవత్సర కాలంలో 7 లక్షల మందికి పైగా ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, భారతదేశంలో సంవత్సరానికి లక్షమంది ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఎక్కువగా 20 నుండి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారే అధికంగా ఉండటం బాధాకరం. మనకున్న సమస్యను ధైర్యంగా తోటి వారికో, సంబంధిత వైద్యునికో తెలుపుకుంటే ప్రారంభంలోనే సమస్యను పరిష్కరించుకోవచ్చు. మనకున్న భయం కారణంగా వెనకడుగు వేస్తే ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే అని సూచించారు.

అనంతరం ఆత్మహత్యలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించే పోస్టర్ ను ఎస్పీ , అడిషనల్ ఎస్పీ , పోలీస్ అధికారులు, మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఆత్మహత్యల జోలికి పోవద్దని, అలా పాల్పడితే దాని పర్యవసానాలు తెలిసేలా విద్యార్థులలో అవగాహన కల్పించేందుకు తయారుచేసిన లఘు చిత్రాలను ప్రదర్శించారు. తదుపరి ఆత్మహత్యలు వద్దు. ఆనందమైన జీవితం గడపడానికి కావలసిన మార్గాలను అన్వేషిస్తూ, ఆనందంగా జీవిస్తామని విద్యార్థులందరితో ప్రతిజ్ఞ చేయించారు.


SAKSHITHA NEWS