ఆర్ అండ్ బీ అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలి…
టెండర్ దశలో ఉన్న పనులను త్వరితగతిన ఖరారు చేయాలని ఆదేశం….
నాణ్యత ప్రమాణాల్లో రాజీ ఉండొద్దు…
–కలెక్టర్ కోయ శ్రీహర్ష…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి,
జిల్లాలో ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్దేశిత గడువుల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పనుల అమలులో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
ఐడీఓసీ కార్యాలయంలో ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పాల్గొని జిల్లాలో కొనసాగుతున్న రహదారులు, భవనాల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, టెండర్ దశలో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన ఖరారు చేసి అమలు దశకు తీసుకురావాలని సూచించారు. టెండర్ల ఖరారులో ఎలాంటి జాప్యం జరగకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
సింగరేణి అవసరాల కోసం భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో అవసరం లేని రహదారి విస్తరణ పనులను ప్రోత్సహించవద్దని సూచించారు. ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టాలని తెలిపారు.
మెడికల్ కళాశాల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి సంబంధిత శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. మంథని గెస్ట్ హౌస్ నిర్మాణాన్ని నిర్దేశిత తొమ్మిది నెలల గడువులో పూర్తి చేయాలని సూచించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో రహదారుల మరమ్మతు పనులను అత్యవసరంగా చేపట్టాలని తెలిపారు. పనులు జరుగుతున్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భద్రతా చర్యలు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
పెండింగ్ బిల్లులు, భూసేకరణ, విద్యుత్ లైన్ మార్పిడి వంటి సమస్యలను సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అభివృద్ధి పనుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తూ వారంవారీ నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఆర్ అండ్ బీ ఈఈ భావ్ సింగ్, సీపీఓ రవీందర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
