ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలి…
నేరాల నియంత్రణకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించిన పోలీసులు….
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు…
–డీసీపీ ఏ.భాస్కర్..…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంచిర్యాల,
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్ట కోసం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు.
సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లె గ్రామంలో ఆకస్మికంగా నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో పాల్గొన్న డీసీపీ ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇళ్లను అద్దెకు ఇచ్చే యజమానులు అద్దెదారుల పూర్తి వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆధార్ కార్డు, శాశ్వత చిరునామా, గతంలో పనిచేసిన ప్రాంతం, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించాలని తెలిపారు.
ఇతర రాష్ట్రాల నుంచి జీవనోపాధి కోసం వచ్చిన వారు ప్రశాంతంగా జీవనం సాగించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా నేర కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
గ్రామాల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, దుకాణాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. “ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అని పేర్కొంటూ, దొంగతనాలు, ప్రమాదాలు, గొడవలు, ఇతర నేరాల విచారణలో సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.
యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చదువుతో పాటు క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల విక్రయాలు చేపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
వేసవి నేపథ్యంలో విహార యాత్రలు లేదా స్వగ్రామాలకు వెళ్లే వారు తమ ఇళ్లలో బంగారం, నగదు వంటి విలువైన వస్తువులను ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను ప్రతి వాహనదారు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
అనంతరం సరైన పత్రాలు లేని వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆరు ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ రవీందర్, ఎస్సై ప్రశాంత్, ఎస్సై శ్రావణ్ కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
