కార్మిక సమస్యలపై భవిష్యత్ కార్యాచరణకు మహాసభ వేదిక
20న సుల్తానాబాద్‌లో ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా 4వ. మహాసభ…
పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు వై.వి. రావు, ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపు…
సాక్షిత – పెద్దపల్లి జిల్లా ప్రతినిధి | సుల్తానాబాద్ |
ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా 4వ మహాసభలను ఈ నెల 20న సుల్తానాబాద్‌లోని యశోద నరహరి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వై.వి. రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై మహాసభలను విజయవంతం చేయాలని వారు కోరారు.
ఈ మహాసభకు సీపీఐ జాతీయ నాయకుడు, ఉమ్మడి రాష్ట్రాల శాసనసభ మాజీ ఫ్లోర్ లీడర్ కామ్రేడ్ చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ కలవేన శంకర్, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్. బాలరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం తదితరులు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
మహాసభలో గత కాలంలో చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ, వేతనాలు, ఉపాధి భద్రత, సంక్షేమ అంశాలపై తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉందన్నారు.
ఏఐటీయూసీ అనుబంధ సంఘాలైన మధ్యాహ్న భోజన కార్మికులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ ఉద్యోగులు, హమాలీలు, ఐకేపీ, రైస్ మిల్లులు, గోదాం కార్మికులు, రైల్వే, పోస్టల్, ఎల్ఐసీ, ఎన్టీపీసీ, ఆర్టీసీ, సివిల్ సప్లైతో పాటు సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
మహాసభ రోజున ఉదయం 10 గంటలకు సుల్తానాబాద్ ఐబీ నుంచి మహాసభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్మికుల ఐక్యతను చాటే ఈ మహాసభను విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.


