ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి….

Sakshitha news

ఆటో, మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి….

ఈఎస్‌ఐ, పీఎఫ్‌, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కల్పించాలి
ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ డిమాండ్ – కలెక్టర్‌కు వినతిపత్రం….

సాక్షిత – పెద్దపల్లి జిల్లా ప్రతినిధి | పెద్దపల్లి |

ఆటో అండ్ మోటార్ రంగ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలతో పాటు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం అందించాలని ఐఎఫ్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఐ. కృష్ణ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల ఆటో అండ్ మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర పిలుపులో భాగంగా పెద్దపల్లి జిల్లా మోటార్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఓ ద్వారా జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఐ. కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మోటార్ రంగ కార్మికుల జీవన పరిస్థితుల్లో ఇప్పటికీ ఆశించిన మార్పులు రాలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 లక్షల మంది లారీ, క్యాబ్, తుఫాన్, మినీ బస్సు, వ్యాన్, అంబులెన్స్, ఆటో, డీసీఎం, మ్యాజిక్ తదితర వాహనాలను నడుపుతూ జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో ఎంతో మంది ఈ వృత్తిని ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.

మోటార్ రంగ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పీఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, సామాజిక భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 రోడ్డు భద్రత చట్టంలోని హిట్ అండ్ రన్ నిబంధనలపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రమాదాల సందర్భంలో డ్రైవర్లపై కఠిన శిక్షలు, భారీ జరిమానాలు విధించే నిబంధనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశవ్యాప్తంగా మోటార్ రంగ కార్మికులను ఐక్యం చేసి ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మోటార్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ. నరేష్, ఉపాధ్యక్షుడు బి. కొమరయ్య, ప్రధాన కార్యదర్శి ఎడ్ల రవికుమార్, జిల్లా నాయకులు ఐ. రాజేశం, తిర్రీ బాలకృష్ణ, పోగుల శేఖర్, ఎనగంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top