సులబ్ కాంప్లెక్స్‌లను తొలగించొద్దు – కార్మికుల ఉపాధి, ప్రజల సౌకర్యాలను కాపాడాలని ఐఎఫ్‌టీయూ డిమాండ్….

Sakshitha news

సులబ్ కాంప్లెక్స్‌లను తొలగించొద్దు – కార్మికుల ఉపాధి, ప్రజల సౌకర్యాలను కాపాడాలని ఐఎఫ్‌టీయూ డిమాండ్….

జీఎంకు వినతిపత్రం సమర్పించిన సులబ్ కార్మిక సంఘం నాయకులు…

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,

సింగరేణి పరిధిలో ప్రజలు, కార్మికుల అవసరాల కోసం గత మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్న సులబ్ కాంప్లెక్స్‌లను తొలగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని కోరుతూ సింగరేణి సులబ్ కార్మిక సంఘం (ఐఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో డీజీఎం (సిబ్బంది) తిరుపతి ద్వారా జీఎంకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. అశోక్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్‌లు గత 30 సంవత్సరాలుగా కార్మికులతో పాటు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు.
కార్మికులు, ప్రయాణికులు, స్థానిక ప్రజలు నిత్యం వినియోగిస్తున్న ఈ సౌకర్యాలను తొలగించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

ప్రస్తుతం లెనిన్‌నగర్, సెక్టార్–1, సింగరేణి పాఠశాల సమీపం, విటల్‌నగర్, ఎల్‌ఈపీ ప్రాంతాల్లోని సులబ్ కాంప్లెక్స్‌లను వినియోగంలో లేవనే పేరుతో తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసిందని, అలాంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని యాజమాన్యాన్ని కోరారు.

ఈ కాంప్లెక్స్‌లలో పనిచేస్తున్న కార్మికులు గత 30 సంవత్సరాలుగా ఇదే ఉపాధిపై ఆధారపడి తమ కుటుంబాలను పోషించుకుంటున్నారని, వాటిని తొలగిస్తే కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా సులబ్ కాంప్లెక్స్‌ల తొలగింపుతో కార్మికులతో పాటు ప్రజలకు కూడా తీవ్ర అసౌకర్యం కలుగుతుందని పేర్కొంటూ, వాటిని యథావిధిగా కొనసాగించి కార్మికులకు ఉపాధి భరోసా కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఈ. నరేష్, ఎస్‌సీసీడబ్ల్యూయూ ఆర్గనైజింగ్ కార్యదర్శి ఐ. రాజేశం, ఆర్జీ–1 డివిజన్ అధ్యక్షుడు కోట వెంకన్న, సంఘం నాయకులు రామారావు, లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top