విశ్రాంత ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యం – ఎన్టీపీసీ మానవ వనరుల విభాగం నూతన అధిపతిని కలిసిన రేవా ప్రతినిధులు…
వైద్యం, వసతి, సంక్షేమ అంశాలపై వినతులు – సానుకూలంగా స్పందించిన సాగర్ రంజన్ సాహు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: జ్యోతినగర్,
ఎన్టీపీసీలో నూతనంగా మానవ వనరుల విభాగం అధిపతిగా బాధ్యతలు స్వీకరించిన ఏజీఎం సాగర్ రంజన్ సాహును మంగళవారం ఎన్టీపీసీ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం (రేవా) కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు ఆకుల రామ్‌కిషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న వసతి, వైద్య సేవలు, సంక్షేమ సౌకర్యాలకు సంబంధించిన సమస్యలను ప్రతినిధి బృందం సాహు దృష్టికి తీసుకెళ్లింది. ఉద్యోగులకు అందుతున్న సౌకర్యాల మాదిరిగానే విశ్రాంత ఉద్యోగుల సంక్షేమంపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ఎలాంటి వివక్ష లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
దీనికి స్పందించిన సాగర్ రంజన్ సాహు మాట్లాడుతూ, సంస్థ అభివృద్ధికి సేవలందించిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ప్రాధాన్యం ఇస్తుందని, వారి సమస్యలను సానుకూల దృక్పథంతో పరిశీలించి సాధ్యమైన మేరకు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
నూతన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే విశ్రాంత ఉద్యోగుల సంక్షేమం పట్ల సాగర్ రంజన్ సాహు చూపుతున్న చొరవ అభినందనీయమని రేవా నాయకులు పేర్కొన్నారు. ఆయన సేవాభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రేవా అధ్యక్షుడు ఆకుల రామ్‌కిషన్, కార్యదర్శి చేప్యాల శ్రీపతిరావు, సీనియర్ నాయకులు తిరుమల సురేందర్, దుర్గం నర్సయ్య, మంగళంపల్లి రామ్‌నారాయణ, హెచ్.వి. గోపాల్‌రెడ్డి, డి. లాలయ్య, ఈ. వెంకటేశ్వర్లు, కొమ్ము గోపాల్, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.


