39 ఏళ్ల సేవలకు భరోసా కావాలి – నర్సరీ మహిళా కార్మికుల ఆవేదన

Sakshitha news

39 ఏళ్ల సేవలకు భరోసా కావాలి – నర్సరీ మహిళా కార్మికుల ఆవేదన
ఉద్యోగ భద్రత, రోజువారీ ఉపాధి కల్పించాలని ఆర్జీ-1 జీఎం కార్యాలయం ఎదుట నిరసన
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి గోదావరిఖని,

సింగరేణి ఆర్జీ-1 పరిధిలోని నర్సరీలో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతిరోజూ పని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆర్జీ-1 ప్రధాన కార్యాలయం ఎదుట మహిళా కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను వివరిస్తూ ఆర్జీ-1 ప్రధాన అధికారికి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకుడు శనగల శ్రీనివాస్, తెలంగాణ కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 39 సంవత్సరాలుగా 26 మంది మహిళా కార్మికులు నర్సరీలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తూ లక్షలాది మొక్కలను పెంచి సింగరేణి హరితాభివృద్ధికి విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. పాములు, తేళ్ల మధ్య ప్రాణాలకు తెగించి మొక్కల సంరక్షణ, ఎరువుల వేయడం, నీరు పట్టడం, తరలింపు వంటి కఠినమైన పనులు చేస్తున్నప్పటికీ అతి తక్కువ వేతనాలతో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సరీ టెండర్ గడువు ముగిసి ఐదు నెలలు దాటినా, గత మూడు నెలలుగా కార్మికులకు పనులు క్రమం తప్పకుండా కేటాయించకపోవడం వల్ల వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. గతంలో అమలు చేసిన విధంగానే ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులందరికీ నిరంతర ఉపాధి కల్పించాలని, టెండర్ల పేరుతో మహిళా కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం తగదని డిమాండ్ చేశారు.

అలాగే కార్మికులకు రావలసిన బొగ్గుగని భవిష్యనిధి, బోనస్, ఉచిత వైద్య సదుపాయాలు వెంటనే అమలు చేయాలని కోరారు. కొందరు అధికారులు ఏకపక్ష నిర్ణయాలతో ఇతర ప్రాంతాల కార్మికులను తీసుకువచ్చి స్థానిక మహిళా కార్మికుల ఉపాధికి భంగం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సింగరేణి యాజమాన్యం తక్షణ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి నర్సరీని నమ్ముకుని జీవనం సాగిస్తున్న పేద మహిళా కార్మికుల కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీయకుండా ప్రతిరోజూ పని కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, వారి న్యాయమైన హక్కులను పరిరక్షించాలని యాజమాన్యాన్ని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో నర్సరీ మహిళా కార్మికులు నరహరి పద్మ, చెర్ల రాజేశ్వరి, మాదాసి వనమాల, మాదాసి లక్ష్మి, పోగుల లక్ష్మి, అనపురం శారద, ఈశ్వరి, మినుము సుజాత, గాధం లక్ష్మి, కన్నూరు రాజేశ్వరి, ఆడెపు లక్ష్మి, రాజమణి, ఓదమ్మ, భాగ్య తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top