SAKSHITHA NEWS


Rs.500k gas cylinder if Congress wins: PCC president Revanth Reddy

కాంగ్రెస్ గెలిస్తే రూ.500 కే గ్యాస్ సిలిండర్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

మణుగూరు: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం, మణుగూరు మండలాల్లో సోమవారం పర్యటించిన ఆయన.. మణుగూరులో జరిగిన బహిరంగసభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ప్రతి నిరుపేదకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. రైతులకు రూ.2లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామన్నారు. గోదావరి ముంపు బాధితులకు ఇళ్లు నిర్మిస్తామన్నారు.

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దళిత కుటుంబానికి చెందినవారని గుర్తుచేస్తూ.. దళితుణ్ని సీఎం చేయలేకపోయిన కేసీఆర్‌.. తన పార్టీ అధ్యక్షుడిగానైనా దళితుణ్ని నియమిస్తారా అని సవాల్‌ విసిరారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌కు ఇక్కడి ప్రజల కష్టాలూ తెలుసునన్నారు. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇసుక దందా, ఫార్టీ ఫిరాయింపు దందా సాగించిన ఆయనను వచ్చే ఎన్నికల్లో ఇంటికి పంపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. భాజపా పాలనలో నిత్యావసరాల ధరలు రెండింతలయ్యాయని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

నోట్ల రద్దు, జీఎస్టీ బిల్లు, ట్రిపుల్‌ తలాక్‌ల విషయంలో భాజపాకు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు కాంగ్రెస్‌ పంచన చేరాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కానీ రద్దయిన రూ.1,000 నోటు లాంటి కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, సీతక్క, నాయకులు బలరాంనాయక్‌, మల్లు రవి, తాటి వెంకటేశ్వర్లు, చందా లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ నాయకుల సంఘీభావం

అశ్వాపురంమండల కేంద్రంలో రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా సీపీఐ నాయకులు కొద్దిసేపు ఆయనతో కలిసి నడిచారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కమటం వెంకటేశ్వరరావు, మండల కార్యదర్శి అనంతనేని సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS