SAKSHITHA NEWS

ఢిల్లీ :

పోటీ పరీక్షల్లో అవకతవకల(exam malpractices)కు పాల్పడే వారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లును సోమవారం లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టింది.

దీనికింద నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనుంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఈ బిల్లు వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపనుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించనున్నారు.

రాజస్థాన్‌, హరియాణా, గుజరాత్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో  కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. కంప్యూటరైజ్డ్‌ పరీక్షల ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చే దిశగా సిఫార్సుల నిమిత్తం ఉన్నతస్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఇందులో ప్రతిపాదించారు.

పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. అలాగే నిజాయతీతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని యువతకు భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఈ బిల్లు లక్ష్యం విద్యార్థులు కాదని స్పష్టం చేసింది.

జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసని, ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని వెల్లడించారు. 

WhatsApp Image 2024 02 06 at 12.58.06 PM

SAKSHITHA NEWS