SAKSHITHA NEWS

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)

సాక్షిత మెదక్ ప్రతినిధి:

గ్రామపంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపొందిం చి ప్రత్యేక అధికారుల పాలన ద్వారా అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. శనివారం ములుగు జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుండి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో గ్రామపంచాయతీల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఇందులో భాగంగా ప్రత్యేక అధికారుల పాలన ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రానున్న వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా పూర్తి స్థాయిలో త్రాగునీరు అందించడంతో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యలయం లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ రాజర్షి షా,జిల్లా అదనపు కలెక్టర్ రమేష్,జిల్లా పంచాయతీ అధికారి సాయి బాబు, జెడ్పి సీఈఓ శైలేష్ ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన సర్పంచ్ ల పదవీకాలం ముగిసినందున జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈ నెల 2వ తేదీ నుండి ప్రత్యేక అధికారులు బాధ్యతలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.
ప్రతి గ్రామ పంచాయతీకి మండల స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, గ్రామ పంచాయతీలలో పంచాయతీ కార్యదర్శులను సిబ్బందితో సమన్వయం చేసుకొని పనిచేసే విధంగా ప్రత్యేక అధికారులకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
వేసవిలో త్రాగునీటికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా కార్యాచరణ రూపొందించి ప్రణాళికాబద్ధంగా అమలు చేసే విధంగా గ్రామీణ నీటి సరఫరా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రతి కుటుంబానికి మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు అందించడం జరుగుతుందని తెలిపారు.గ్రామపంచాయతీలలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పనులను వెంటనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఉపాధి హామీ కూలీల శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, నర్సరీల నిర్వహణ, మొక్కల సంరక్షణ, డంపింగ్ యార్డ్ల నిర్వహణ, వైకుంఠధామాల అభివృద్ధిపై సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఈనెల 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు గ్రామపంచాయతీలలో పారిశుధ్యం పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 03 at 8.58.13 PM

SAKSHITHA NEWS