SAKSHITHA NEWS

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ లాంఛనంగా ప్రారంభించారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో ముందుగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టారు.

మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సులను కలెక్టర్ పచ్చ జెండా ఊపి పథకాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు వీరికి జీరో టికెట్ ఇవ్వబడుతుందన్నారు.

అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచిందని, ప్రతి నిరుపేద కుటుంబానికి సాలీనా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10 లక్షల విలువైన ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు.

మహిళలు, బాలికలు, ఉద్యోగినులు, విద్యార్థినులతో బస్సులు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణ నుండి ఆర్టీసీ బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, కలెక్టరేట్ వరకు బస్సులో ప్రయాణం చేశారు.

ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి కలెక్టర్ శరత్,అదనపు కలెక్టర్ మాధురి,ఇతర జిల్లా మహిళా అధికారులు
ప్రయాణించారు.

బస్సులోని మహిళలకు ఎలాంటి చార్జీలు లేకుండా జీరో ఫేర్ తో కూడిన మహాలక్ష్మి టికెట్ లను కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఉచిత రవాణా వసతిని అందుబాటులోకి తేవడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మాధురి,ఆర్టీసీ ఆర్ఎం ప్రభులత ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రి దేవి, జిజిహెచ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్ కుమార్ , మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాణి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్,జిల్లా అధికారులు,మున్సిపల్ కమిషనర్, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS