కుల గణనపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాంరాచాల యుగంధర్ గౌడ్

Spread the love

దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సంధర్బంగా రాచాల మాట్లాడుతూ పదేండ్ల బీజేపీ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని, ప్రధానిగా ఓబీసీకి చెందిన మోడీ ఉన్నప్పటికీ బీసీలకు న్యాయం జరగలేదన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్‌కు, దేశవ్యాప్తంగా ‘ఇండియా’ కూటమికి బీసీలంతా స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారన్నారు.

దేశంలో మొదటిసారి ఓబీసీ ప్రధానిగా మోడీ గుర్తింపు పొందారని, కానీ ఓబీసీ డిమాండ్లలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదని, బీజేపీ పాలనలోనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు.

చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ కులగణన, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే సామాజిక ఆర్థిక సమగ్ర కులగణన అంశంపైనే మొట్టమొదటి సంతకం చేసి బీసీ రిజర్వేషన్లను పెంచుతామని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా, సామాజిక రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేత తదితర డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చడంతో పాటు వాటిని అమలు చేస్తామని వాగ్దానం ఇచ్చినందున బీసీలందరూ కాంగ్రెస్‌కు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నేతృత్వంలోనే బీసీల ఆకాంక్షలు నెరవేరుతాయని, అందుకోసం ఆ కూటమిని అధికారంలోకి తేవడానికి బీసీ శ్రేణులంతా శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

బీసీలు వారి లక్ష్యసాధన కోసం ప్రయాణం కొనసాగించాలని, అందుకు కొన్ని రాజకీయ నిర్ణయాలూ తీసుకోవాలన్నారు. బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు పెంచుతామన్న పార్టీకి అండగా నిలబడాల్సిన సామాజిక బాధ్యత బీసీలపై ఉందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమగ్ర కులగణన కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కులగణన చేపట్టడానికి జీవో తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఈ ఎన్నికలలో అండగా నిలబడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

ఈనెల 13వ తేదీన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థి డా: మల్లు రవి గారి చేతి గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి నాయకులు సంపత్ కుమార్, మనిగిల్ల శివ, అమ్మపల్లి బాలు, మహేష్ యాదవ్,మ్యాదరి రాజు, శివ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page