జనగామ :
సీనియర్ నేత, మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పొన్నాల లక్ష్మయ్య కారెక్కారు.
జనగామ బీఆర్ఎస్ బహిరంగ సభలో కండువా కప్పి పొన్నాలను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. జనగామ మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, 18వ వార్డు కౌన్సిలర్ గాడిపెల్లి ప్రేమలత రెడ్డి, 30వ వార్డు కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్ కూడా బీఆర్ఎస్ లో చేరారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు పొన్నాల లక్ష్మయ్య. కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని పొన్నాల ఆరోపించారు. పార్టీ అంశాలు చర్చించేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. కొందరు నాయకుల వైఖరితో పార్టీ పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు.ఈ పదేళ్లలో తనకు ఒక్కపదవి కూడా ఇ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడైనా కనిపిస్తే నమస్తే పెట్టినా స్పందించరని, సొంత పార్టీలోనే పరాయి వ్యక్తులమయ్యామని పొన్నాల వాపోయారు.
జనగామ టికెట్ పై పొన్నాల ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ, టికెట్ దక్కదని తెలిసి తీవ్రంగా నిరాశ చెందారు. కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నానని.. ఇక భరించలేక రాజీనామా చేశానని పొన్నాల చెప్పారు.
45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి చేరుకున్నా. కానీ పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా చేయాల్సి వచ్చింది అని పొన్నాల వాపోయారు.