People should be fully aware of the Right to Information Act.
సమాచార హక్కు చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన పెంపొందించాలి.
-రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. గుగులోత్ శంకర్ నాయక్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
సమాచార హక్కు చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన పెంపొందించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ డా. గుగులోత్ శంకర్ నాయక్ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయల భవన సముదాయ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం-2005 పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం సెక్షన్ 5 (1) 5 (2) ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సెక్షన్ 4(1) బి సమాచారాన్ని తప్పనిసరిగా పొందుపరచాలని అన్నారు. సమాచార హక్కుచట్టం సెక్షన్ 6(1) ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని, సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజులలో అందించాల్సిన బాధ్యత ఆయా శాఖల ప్రజా సమాచార అధికారులపై ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలనలో పారదర్శకత అధికార యంత్రాంగంలో జవాబుదారితనంతో ప్రజలు కోరిన సమాచారాన్ని 30 రోజుల కాలంలో ఇవ్వాలని, అలా సకాలంలో సమాచారం ఇవ్వని కారణంగా కమిషన్ నేరుగా ప్రజలు, ఆయా శాఖల పౌర సమాచార అధికారులతో జిల్లా కేంద్రంగా కమిషన్ కోర్టును ఏర్పాటు చేసి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటుందున్నారు.
ఆయా జిల్లాలకు సంబంధించిన కేసుల విచారణ ప్రక్రియ నిర్వహించి దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని అందించేలా ఆదేశాలు ఇవ్వడం జరిగుతుందని ఆయన తెలిపారు. సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల కాల వ్యవధిలో సమాచారం ఇవ్వని యెడల, మొదటి అప్పీల్ చేసుకోవడానికి ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని అన్నారు. 30 రోజుల వ్యవధిలో సమాచారం ఇవ్వని క్రమంలో సెక్షన్ 19 (1) ప్రకారం మొదటి అప్పీల్ చేసుకుంటే మొదటి అప్పిలేట్ అధికారి సమాచారం విచారణ చేపట్టి ఇప్పించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. మొదటి అప్పిలేట్ అథారిటి ఉండి, పరిష్కారం చేయని యెడల సెక్షన్ 19(3) ప్రకారం రాష్ట్ర సమాచార కమిషనర్ కి దరఖాస్తు చేసుకోవాలని ఆయన అన్నారు. పౌర సమాచార అధికారులు సెక్షన్ 4(1) బి ప్రకారం 17 అంశాలతో కూడిన సమాచారం కార్యాలయంలో ప్రదర్శించాలన్నారు.
సెక్షన్ 4(1) బి నిర్వహణ వల్ల కార్యాలయ విధులు నిర్వహణ, కార్యాలయ సమగ్ర సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు. సెక్షన్ 5 (1), 5 (2) ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం 2005 లో పౌర సమాచార అధికారి, మొదటి అప్పిలేట్ అథారిటీల పేర్లు, హెూదా, ఫోన్ నెంబర్ల వివరాలతో అమలు బోర్డులు ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ప్రతి ఫైలుకు సంబంధించిన రికార్డ్సు సరియైన పద్దతిలో నిర్వహించడం ద్వారా పరిష్కారం సులభతరమవుతుందని, ఇట్టి విషయంపై అన్ని శాఖల్లో అధికారులు, సిబ్బంది సమగ్ర విధానాన్ని అనుసరించాలన్నారు. ఈ ఆఫీసు విధానంలో ఫైలు నిర్వహణ ద్వారా సమగ్ర సమాచారం ఎప్పటికి అందుబాటులో ఉంటుందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేసే అవకాశం ఉండబోదన్నారు.
ప్రతి ఒక్కరు ఈ ఆఫీసు విధానంలో ఫైల్సు నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు తమ శాఖకు సంబంధించిన విధులు, విధానాలు, సమగ్ర సమాచారాన్ని పబ్లిక్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. అవగాహనకార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.