ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య..

Spread the love

Quality free education for every poor..

ప్రతి పేదవాడికి నాణ్యమైన ఉచిత విద్య..

కార్పొరేట్ కు దీటుగా విద్యతో పాటు అన్ని మౌలిక వసతులు

ఖమ్మం జిల్లాలో తొలి విడతలో 426 పాఠశాలలు ఎంపిక.

వెపకుంట్ల, గణేశ్వరం ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే దృడ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఊరు – మన బడి (మన బస్తీ – మన బడి) ద్వారా నేడు గ్రామాల్లో విద్యార్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో రూ.8.76 లక్షలు, గణేశ్వరం గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలో రూ. 10.89 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.
అనంతరం నూతన డెస్క్ లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన అద్భుత పథకం అని అన్నారు.


గత ప్రభుత్వంలో ఉన్న పాఠశాలల ను మూసివేసే పరిస్థితులు ఉన్న నాటి నుండి నేడు ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కొరకు స్థానిక ప్రజాప్రతినిధులను సిఫారసు కోరుతున్న పరిస్థితి నేడు వచ్చిందన్నారు. ప్రభుత్వ విద్యా విధానంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పాఠశాలలను పటిష్ట పరచి, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. సన్నబియ్యంతో భోజనం, ఉచిత యూనిఫాం ఇచ్చి మంచి వసతులతో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు.


ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, నమోదు, హాజరు, కొనసాగింపుతో పాటు దశలవారీగా డిజిటల్‌ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల ఏర్పాటుకై ఈ పథకం రూపొందించబడిందన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా 7,289 కోట్ల రూపాయలతో‘మన ఊరు – మన బడి’ పథకం క్రింద పాఠశాలలో ఆయా మౌలిక వసతులను ఎర్పాటు చేస్తున్నామని అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో ఎంపిక చేసిన 426 ప్రభుత్వ పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులు కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.


‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు, విద్యుత్‌, తాగునీరు, ఫర్నిచర్‌, పెయింటింగ్‌, మరమ్మతులు, గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ప్రహరీలు, వంట గది, అదనపు తరగతి గదులు, ఉన్నత పాఠశాలల్లో డ్రైనింగ్‌హాల్‌, డిజిటల్‌ విద్య అమలుకు అవసరమైన పాఠశాలల్లో తగు చర్యలు చేపట్టామన్నారు.


ప్రతి పేద విద్యార్ధికి నాణ్యమైన, ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని ప్రభుత్వ నిర్ణయించిందన్నారు.అందుకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి కార్పొరేట్ కి మించి ఉచిత విద్యను అందిస్తామని వివరించారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహలత, డీఈవో సోమశేఖర్ శర్మ, ఎంపీపీ మలోత్ గౌరి తదితరులు ఉన్నారు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page