ఇప్పుడు మాపై విమర్శలు చేయడం హాస్యాస్పదం.
-మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం
కోవిడ్ సమయంలో నియోజకవర్గ ప్రజలను వదిలిపెట్టి హైదరాబాద్ పారిపోయిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడు ఇప్పుడు తనపై, తమ నాయకులు సీఎం జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు చేస్తుంటే హాస్యాస్పదంగా ఉందని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ‘ఆంధ్రాకు జగనే ఎందుకు కావాలి’ (why ap needs jagan) అనే కార్యక్రమానికి సంబంధించి పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాదు మాట్లాడుతూ అక్టోబరు11 నుండి నవంబరు20 వరకు జరగబోయే భారీ కార్యక్రమమే ‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?’ అని అన్నారు. కోవిడ్ సమయంలో తామంతా ఇక్కడే ఉండి పలు సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. ప్రత్యేకంగా వైద్యచికిత్సలకు ఏర్పాట్లు చేశామన్నారు. మందులు అందజేశామన్నారు.
జన్మభూమి కమిటీలతో కొందరికే పరిమితంగా సంక్షేమ పథకాలు వర్తింపజేసిన గత ప్రభుత్వానికి, సచివాలయ వాలంటీర్ వ్యవస్థతో అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని వివరించాలన్నారు.
సీఎం జగనన్న ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారం నవరత్నాలను నూరుశాతం అమలు చేశారని అన్నారు. పింఛన్లు పెంచి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. పేదలందరికి ఇళ్లస్థలాలు, ఇళ్ళు ఇచ్చామన్నారు. జగనన్న ప్రభుత్వంలో జరిగిన మంచిని ప్రతి గడపకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ప్రతిపక్ష నేతలకు చెప్పుకోవడానికి ఏమి లేదన్నారు. గత ప్రభుత్వంలో సుమారు 650 హామీలు ఇచ్చి ఏదీ సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. మాటల గారడీతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంపై, జగనన్నపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని, దీన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
అతను మంత్రిగా ఉన్నప్పటి కంటే తమ హయాంలోనే మైలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఎక్కువగా చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో నీరు-చెట్టు పేరుతో జేబులు నింపుకున్నారని ఆరోపించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు తదితరులు పాల్గొన్నారు.