తెలంగాణ పక్షాన కేంద్రంపై అవిశ్వాస తీర్మానం

Spread the love

అవిశ్వాస చర్చలో కేంద్ర వైఫల్యాలను ఎండగడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిని వివరిస్తాం
బీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

కేంద్రంలోని మోడీ సర్కారుపై తెలంగాణ ప్రజలు విశ్వాసం కోల్పోయారని అందుకే రాష్ట్ర ప్రజల పక్షాన బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ఇచ్చామని బీఆర్ఎస్ లోక్ సభ పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు కేంద్రంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్ సభలో నేటి నుండి చర్చ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న మణిపూర్ అంశం ఒక్కటే కాకుండా కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో అన్ని అంశాల్లో పూర్తి స్థాయిలో విఫలమైందని ఆయన తెలిపారు. తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి అందిన సహాయం శూన్యం అన్నారు.

రాష్ట్రంపై చిన్న చూపుతో రాష్ట్ర ప్రజల పై కక్ష్య సాధింపుగా కేంద్రం వైఖరి ఉందన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జిల్లాకో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం లో మాత్రం ఒక్క పాఠశాల కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. అలానే రాష్ట్రానికి ఒక్క మెడికల్ కళాశాల కూడా మంజూరు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వమే మెడికల్ కళశాలలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలు విషయంలో కూడా కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి ఇస్తుందన్నారు.

కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు, రైతులకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కేంద్రం సహకరించకున్న కేసీఆర్ పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. సభలో జరిగే అవిశ్వాస తీర్మానం చర్చ లో బీఆర్ఎస్ పార్టీ నుండి రాష్ట్ర ప్రజల వాణిని వినిపిస్తామని తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తామని ఎంపీ నామ చెప్పారు.

Related Posts

You cannot copy content of this page