SAKSHITHA NEWS

రైతుల వెంటే నేను…

పార్లమెంట్ లో కొత్త రైల్వే లైన్ పై మాట్లాడతా!

ఖమ్మం జిల్లా బయట నుంచి లైన్ వేసుకోండి!

రైల్వే మంత్రి దృష్టికి రైల్వే లైన్ సమస్య

బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు స్పష్టీకరణ

…..
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ఖమ్మం జిల్లా ప్రజలకు, రైతులకు ఎంతో నష్టదాయకంగా పరిణమించిన డోర్నకల్ – మిర్యాలగూడ నూతన రైల్వే లైన్ ను ఎట్టి పరిస్థితుల్లోను ఖమ్మం జిల్లాలో అనుమతించే ప్రసక్తేలేదని బీఆర్ఎన్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాకు ఎటువంటి ఉపయోగం లేని ఈ రైల్వే లైన్ ను జిల్లాతో సంబంధం లేకుండా బయట నుంచి తీసుకెళితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకు స్పష్టం చేయడం జరిగిందని నామ పేర్కొన్నారు. ఈ కొత్త రైల్వే లైన్ వల్ల ఖమ్మం జిల్లాకు చెందిన రైతాంగం, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోను ఈ నూతన రైల్వే మార్గాన్ని జిల్లాలో అనుమతించే ప్రసక్తే లేదని ఖరా ఖండిగా మరోసారి చెప్పారు.

ఈనెలలో ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో డోర్నకల్ – మిర్యాలగూడ రైల్వే లైన్ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తానని నామ ఖమ్మం జిల్లాకు చెందిన అన్నదాతలకు, ప్రజలకు అభయం, భరోసా ఇచ్చారు. జిల్లా ప్రజలకు ముఖ్యంగా తన పార్లమెంట్ పరిధిలోని ఏ ఒక్క రైతుకు కానీ, ప్రజలకు కానీ ఈ కొత్త రైలు మార్గం వల్ల నష్టం జరిగితే సహించేది లేదన్నారు. ఖచ్చితంగా అడ్డుకుని తీరుతానన్నారు. ఇప్పటికే జాతీయ రహదారులు,ఇతర వాటి వల్ల రైతులు తమ విలువైన భూములను కోల్పోయి, నష్టపోయారని, మళ్లీ ఇప్పుడు ఈ కొత్త రైలు మార్గం వల్ల అరకొరగా ఉన్న కొద్దిపాటి విలువైన భూములను కోల్పోవడానికి సిద్ధంగా లేరని చెప్పారు. రైలు మార్గం ప్రతిపాదించిన ఏరియాల్లోని భూములు ఎంతో విలువైనవని, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పేదల ఇండ్లు భూముల్లో ఉన్నాయని తెలిపారు.

ఈ నూతన రైలు మార్గం వల్ల ఖమ్మం జిల్లాకు చెందిన రైతాంగానికి జరుగుతున్న నష్టం వివరాలతో పాటు ఇతర అన్ని అంశాలను పార్లమెంట్ సాక్షిగా కేంద్రం దృష్టికి తీసుకెళతానని నామ తెలిపారు. పార్లమెంట్లో ఈ అంశాన్ని లేవనెత్తడంతో పాటు సంబందిత కేంద్ర రైల్వే మంత్రిపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు చెప్పారు. తాను మొదటి నుంచి కూడా జిల్లాలో ఈ రైలు మార్గానికి వ్యతిరేకమని చెప్పారు. ఇటీవల జరిగిన దిశ కమిటీ సమావేశంలో కూడా ఈ విషయమై సంబంధింత అధికారులను పిలిపించి, మాట్లాడడం జరిగిందని, ఖమ్మం జిల్లాతో సంబంధం లేకుండా బయట నుంచి ఈ నూతన రైలు మార్గాన్ని నిర్మించుకోవచ్చని తాను ఆ సమావేశంలో రైల్వే అధికారులకు స్పష్టం చేయడం జరిగిందని తెలిపారు.

ఇప్పటికే పలుమార్లు రైల్వే మంత్రితోను, సంబంధిత రైల్వే ఉన్నతాధికారులతోను ఈ విషయమై చర్చించడం జరిగిందని నామ చెప్పారు. ఖమ్మం జిల్లా ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేని ఈ కొత్త రైల్వే లైన్ తమకు అవసరం లేదని తాను ఖరా ఖండిగా రైల్వే మంత్రికి మళ్లీ స్పష్టం చేస్తానని అన్నారు. ఈ విషయంలో రైతులు, ప్రజలు చేసే ఎటువంటి అందోళనకైనా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, వారికి అండగా ఉంటానని ప్రజల అభీష్టమే తన అభిమతమని నామ నాగేశ్వరరావు వెల్లడించారు.


SAKSHITHA NEWS