తిరుపతి నగరంలోని చేపట్టబోవు అభివృద్ది పనులపై చర్చించి, తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు ఆమోదం తెలపడం జరిగిందని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన, కమిషనర్ హరిత ఐఏఎస్ అజెండా అంశాలను ప్రవేశపెట్టగా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు నరసింహాచారి, గణేష్, ఉమాఅజయ్, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు పాల్గొని అజండా అంశాలపై చర్చించి ఆమోదించడం జరిగింది. డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్ని జలమయం అయ్యేవని, నేడు రికార్డు స్థాయిలో 125 ఎం.ఎం వర్షం కురిసినా, ప్రస్తుత నగర పాలక సంస్థ ముందు చూపుతో మెరుగైన డ్రైనేజ్ వ్యవస్థతో చుక్క నీరు కూడా నిలవనీకుండా చేయడం అభినందనీయమన్నారు.
తిరుపతి నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది, కార్పొరేటర్ల సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాదించామన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదించిన ముఖ్య అంశాల్లో కళ్యాణి డ్యాం వద్ద ఉన్నటువంటి రెండు ఫిల్టరేషన్ ప్లాంట్లు, అలిపిరి వద్ద ఫిల్టరేషన్ ప్లాంట్, టౌన్ సర్వీస్ రిజర్వాయర్, బిపి ట్యాంకుల వద్ద నీటిని శుద్ధి చేయుటకు, అదేవిధంగా మంగళం వద్ద ఫిల్టరేషన్ ప్లాంట్లలో, త్వరలో ప్రారంభించబోవు ఫిల్టరేషన్ ప్లాంట్ నకు, తెలుగుగంగ నీటిని శుద్ది చేయుటకు ఉపయోగించు వేపొరైజ్డ్ లిక్విడ్ క్లోరిన్ గ్యాస్, ఫెర్రిక్ ఆలమ్, లిక్విడ్ క్లోరిన్ ఓక సంవత్సరంనకు కొనుగొలు చేయుటకు 50 లక్షలు, 49.95 లక్షలు కేటాయిస్తూ ఆమోదించడం జరిగింది.
క్రాంతి నగర్ నుంచి సత్యనారాయణపురం పాఠశాల వరకు సిసి రోడ్డు నిర్మించుటకు 49.95 లక్షలు, కరకంబాడి రోడ్డులో సెంట్రల్ డివైడర్ నందు గ్రీనరీ వేయుటకు 49.15 లక్షలు, రేణిగుంట రోడ్డు స్కోడా షోరూమ్ ఎదురుగా తూకివాకం వైపు వెలుతున్న పగిలిన పైపులను తొలగించి పునరిద్దరించుటకు 49.50 లక్షలు, నూతనంగా ఎస్.టి.వి నగర్ రోడ్డు, కాలువలు, రాఘవేంధ్ర నగర్ మెయిన్ రోడ్డు వేయించేందుకు 46 లక్షలు, గొల్లవానిగుంట నందు కాలువలు నిర్మించుటకు 43 లక్షలు, మధురానగర్ మునిసిపల్ పార్క్ పడమర భాగమున రోడ్డు వేయించుటకు 36.65 లక్షలు, మరికొన్ని పనులకు ఆమోదం తెలుపుతూ స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదం తెలపడం జరిగింది. ఈ సమావేశంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ రాధిక, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిప్యూటీ సిటీ ప్లానర్ శ్రీనివాసులు రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాలసుబ్రమణ్యం, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, హార్టికల్చరల్ ఆఫిసర్ హరికృష్ణా రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు పాల్గొన్నారు.*