పొందుగలలో పంగిడి చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
మైలవరం మండలం పొందుగల గ్రామంలో పంగిడి చెరువును మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పరిశీలించారు. ‘పల్లెపండుగ’ కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవారం పొందుగల గ్రామానికి విచ్చేశారు. గత నెలలో అకస్మాత్తుగా కురిసిన మహాకుంభవృష్టికి పంగిడి చెరువు కరకట్ట తెగిపోయిన విషయం తెలిసిందే. అప్పట్లో వసంత కృష్ణప్రసాదు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన స్థానిక నాయకులు పంగిడి చెరువు కట్టకు పడిన గండిని పూడ్చివేశారు.
సాధ్యమైనంత వరకు నష్టాన్ని నివారించారు. స్థానిక నాయకుల విజ్ఞప్తి మేరకు పంగిడిచెరువును, దానికి పడిన గండిని పూడ్చిన వైనాన్ని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పరిశీలించారు. చెరువును అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు చేపడతామన్నారు. వరద బీభత్స సమయంలో స్థానిక నాయకులు సమయస్ఫూర్తితో వ్యవహరించి, వరదల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించారని పేర్కొన్నారు. వరదల సమయంలో ప్రజలకు సేవలందించిన నాయకులను ప్రత్యేకంగా అభినందించారు. మైలవరం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.