తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను శ్రమ దోపిడికి గురిచేస్తుంది: కిషన్ రెడ్డి

Spread the love

హైదరాబాద్ :
17 సంవత్సరాలుగా హోంగార్డు ఉద్యోగం చేస్తున్న రవీందర్ ఆత్మహత్యాయత్నం బాధాకరమని, దురదృష్టకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. హోంగార్డు వ్యవస్థలో శ్రమ దోపిడీ జరుగుతోందని, తెలంగాణ ప్రభుత్వం హోంగార్డు వ్యవస్థను అవమానిస్తోందని, హోంగార్డు సంక్షేమం కోసం నిరంతర పోరాటం చేశానని అన్నారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు హోంగార్డు హక్కులు, సమస్యల కోసం ప్రభుత్వాన్ని నిలదీశానన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదని ఆరోపించారు. హోంగార్డు వ్యవస్థను క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి.. ఇంత వరకు చేయలేదని విమర్శించారు.

హోంగార్డుల డ్యూటీ 8గంటలయితే.. అంతకంటే ఎక్కువ సమయం డ్యూటీ చేస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. హోంగార్డులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని, హెల్త్ పరంగా, అలెవెన్సు, డబల్ బెడ్ రూమ్ ఇళ్లు హోంగార్డులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చిన హోంగార్డులకు న్యాయం జరగలేదన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన వీడియోను మీడియాకు చూపించారు. కేసీఆర్ హామీ ఇచ్చి ఐదున్నరేళ్లు కావొస్తున్న సమస్య పరిష్కారం కాలేదన్నారు. హోంగార్డులు రోడ్డున పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హోంగార్డులకు సకాలంలో జీతాలు ఇవ్వాలని, రవీందర్ ప్రాణాలు కాపాడడం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కిషన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవీందర్ ప్రాణాలతో బయటపడాలని కోరుకుంటున్నానన్నారు.

హోంగార్డు హక్కులను కపాడాల్సిన అవసరం ఉందని, హోంగార్డులు ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. ఆత్మహత్యల ద్వారా సమస్య పరిష్కారం కాదని, హక్కుల కోసం శాంతియుతంగా పోరాడాలన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక హోంగార్డులకు అండగా ఉంటామని, రవీందర్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

Related Posts

You cannot copy content of this page