రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర..

Spread the love

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది.

సుమారు 17 రోజుల పాటు సాగే ఈ యాత్రకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో పార్టీ అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. మిర్యాలగూడలో ప్రారంభమైన యాత్ర సిద్దిపేటలో బహిరంగ సభతో ముగియనుంది. లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభించారు. దాదాపు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం, ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించే విధంగా బస్సు యాత్రను ప్లాన్ చేశారు. తమ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ బస్సుయాత్ర చేయాలని వివిధ నియోజకవర్గాల నేతల నుంచి డిమాండ్ ఉంది. అయితే సమయాభావం, ఎండ వేడిమిని దృష్టిలో ఉంచుకుని పలు నియోజకవర్గాల్లో మాత్రమే బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించారు.

కేసీఆర్ యాత్ర పొడవునా 100 మందికి పైగా వాలంటీర్లు వాహన శ్రేణి వెంట రానున్నారు. ఇప్పటికే ఎంపికైన వారికి సోమవారం తెలంగాణ భవన్‌లో అవగాహన కల్పించారు. తొలిరోజైన బుధవారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ క్యాడర్, నేతలతో భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తొలిరోడ్డు షోలో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, ప్రజలు ఉత్సాహంగా, స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకు వస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ప్రజలు పెద్దఎత్తున నిలబడి ప్రసంగాన్ని దూరం నుంచి వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలకు ప్రజల్లో భారీ స్పందన వస్తుందని స్పష్టంగా భావిస్తున్నారు.

Related Posts

You cannot copy content of this page