SAKSHITHA NEWS

కూతురు కోసం ఢిల్లీకి కేసీఆర్
◆కవిత అరెస్ట్ ఖాయమని తెలిసే ఢిల్లీకి పరుగు
◆బీజేపీ,టీఆర్ఎస్ వేర్వేరు కాదు
◆ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకమే ఉప ఎన్నిక
◆సంతలో పశువుల వలే మనుషులను కొంటున్నారు

నల్గొండ జిల్లా:
లిక్కర్ స్కాంలో కేసీఆర్ బంధువు అభిషేక్ రావు అరెస్టయిన తర్వాత, తదుపరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అవుతుందని తెలిసే తన కూతురుని కాపాడుకోవడం కోసం
కేసీఆర్ ఢిల్లీకి పరుగు పెట్టాడని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ డా.ఆర్. ఎస్.ప్రవీణ్ కుమార్
ఆరోపించారు.
మంగళవారం ఆయన బహుజన రాజ్యాధికార యాత్ర
రెండవ విడతలో భాగంగా చండూరు మండలంలోని గుండ్రెపల్లి, తుమ్మలపల్లి, దోనిపాముల,నర్మెట,కొండాపురం గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిడ్డను లిక్కర్ కేసును నుండి తప్పించడానికి కేసీఆర్ పడరాని పాట్లు పడుతున్నారని,
కేంద్రంతో మంతనాలు జరపడానికే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారన్నారు. బీజేపీ,టిఆర్ఎస్ రెండూ ఒక్కటేనని ఒప్పందం ప్రకారం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలందరూ అర్థం చేసుకుని,స్కాంలు,కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయే నాయకులను,
ఆ దోపిడీ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఉపఎన్నికలో గెలవడం కోసం ఆధిపత్య పార్టీలు వందలకోట్లు ఖర్చు చేస్తున్నాయని, సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటిసిలను సంతలో పశువుల వలే లక్షల రూపాయల పోసి కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
బహుజన్ సమాజ్ పార్టీ ప్రజల్లో తిరుగుతూ వారి కష్టాలను తెలుసుకుంటుండగా రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఆధిపత్య పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని,అభివృద్ధి చేయకపోవడం వల్ల ప్రజల దగ్గరకు వెళ్లి ఓటు అడిగే ధైర్యం లేక టిఆర్ఎస్,బిజెపి పార్టీలు నాయకులను కొంటున్నారని ఎద్దేవా చేశారు.కానీ,పేద ప్రజలు ఈ దొరలను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
ఇంతకాలం ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా వారు అభివృద్ధి చేయకుండా ఆస్తులను మాత్రమే కూడబెట్టుకున్నారని గుర్తించారన్నారు.
ఇపుడు జరగబోయేది కొండచిలువలకు మరియు చలిచీమలకు మధ్య యుద్ధమని,
ఈ యుద్ధంలో చలిచీమలే గెలుస్తాయన్నారు.
బహుజన రాజ్యంలో ప్రతి ఇంటికి ఒకరిని విదేశాలకు పంపి చదివిస్తామని,భూమి లేని నిరుపేద కుటుంబానికి ఎకరం భూమి ఇస్తామని, నిరుద్యోగ యువతకు పదిలక్షల ఉద్యోగాలు ఇస్తామని,పేదల భూములకు పట్టాలిస్తామన్నారు.బెల్ట్ షాపులను రద్దుచేసి వందేళ్ళు బతికేలా చూస్తామన్నారు.
టిఆర్ఎస్,బిజెపి రాజ్యాంగం తొలగించాలని చూస్తున్నాయని,
అందుకే ఆ పార్టీలను ఓడించాలని పేర్కొన్నారు.
75 సంవత్సరాల దొరల పాలనలో మునుగోడు నిరాధరణకు గురై నలిగిపోయిందన్నారుఇప్పటికీ చండూరులో బుడిగెజంగాలు, ఎరుకల కులాలు చెత్త ఏరుకుని బతుకుతున్నారని గుర్తుచేశారు.మేం దొరల వలే ఫాంహౌస్ లు,బంగళాలు, విదేశాల్లో ఆస్తుల కోసం రాజకీయాల్లోకి రాలేదని,పేదలకు సంపదను పంచడానికే వచ్చామన్నారు.
గుండ్రెపల్లిలో నాయిబ్రాహ్మణ కులస్తులను కలిసి గడ్డం చేశారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు జగన్నాధగౌడ్, ప్రమీల,నర్ర నిర్మల, సుజాత,మండల నాయకులు గణేష్, శివ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS