ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే కష్టమన్న జగన్… సీఎం చెప్పినదాంట్లో తప్పేంలేదన్న మంత్రి జోగి రమేశ్
వైసీపీ ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష సమావేశం
ఎమ్మెల్యేల పనితీరుపై సమీక్ష
గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, క్యాడర్ కు నష్టమన్న సీఎం
మళ్లీ అధికారంలోకి రావడం కోసమే గ్రాఫ్ పెంచుకోవాలన్నారని జోగి వివరణ
ఏపీ సీఎం జగన్ ఇవాళ వైసీపీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించడం తెలిసిందే. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరును నేటి సమావేశంలో సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోకపోతే కష్టమని స్పష్టం చేశారు.
ప్రజల్లో ఎమ్మెల్యేల గ్రాఫ్ సరిగా లేకపోతే అది పార్టీకి, క్యాడర్ కూడా నష్టదాయకమని వివరించారు.
సంక్షేమం కొనసాగించాలంటే అధికారంలో ఉండడం తప్పనిసరి అని, మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారని సీఎం జగన్ వివరించారు.
ప్రతి లబ్దిదారును ఒక ప్రచారకర్తగా మలుచుకోవాలని, గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకం పూర్తి చేయాలని తెలిపారు.
సమీక్ష సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలపై మంత్రి జోగి రమేశ్ స్పందించారు.
గ్రాఫ్ పెంచుకోవాలని, గ్రాఫ్ ఆధారంగానే టికెట్ అని సీఎం జగన్ చెప్పడంలో తప్పేం లేదని అన్నారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం కోసమే గ్రాఫ్ పెంచుకోవాలని సూచించారని తెలిపారు.
నెలలో 25 రోజుల పాటు గడప గడపకు కార్యక్రమం చేపట్టాలని నిర్దేశించారని జోగి రమేశ్ వెల్లడించారు.
ఇక,విపక్ష నేతలపైనా జోగి రమేశ్ విమర్శనాస్త్రాలు సంధించారు. నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచిన చంద్రబాబు పొంగిపోతున్నాడని, చంద్రబాబుకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ములేదని అన్నారు.
ఒంటరిగా గెలిచే సత్తా లేకనే దత్తపుత్రుడు, వామపక్షాలు కలిసి రావాలంటున్నాడని ఎద్దేవా చేశారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో పవన్ బీజేపీతో కలవడని, చంద్రబాబు వైపే ఉంటాడని జోగి రమేశ్ పేర్కొన్నారు.
పవన్ ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో అతడికే తెలియదని వ్యంగ్యం ప్రదర్శించారు