SAKSHITHA NEWS


It has been four years since the end of Prajasankalpayatra

సాక్షిత : వినుకొండ పట్టణంలో వినుకొండ నియోజకవర్గ శాసన సభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రారంభించిన‌ ప్రజాసంకల్పయాత్ర ముగింపునకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు దివంగత మహానేత వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైస్సార్సిపి అధ్యక్షుడు సీఎం వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో చేసిన ప్రజాసంకల్పయాత్ర ముగించి నేటితో సరిగ్గా నాలుగేళ్ళు పూర్తయ్యాయని అప్పట్లో దేశ రాజకీయాల్లోనే ఈ యాత్ర ఒక సంచలనం, చరిత్రాత్మకం అని అన్నారు.

మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకురావాలన్న సంకల్పంతో వైయస్సార్ జిల్లా ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి సమాధి వద్ద 2017 నవంబర్ 6న వేసిన తొలి అడుగు ఎండ, వాన లెక్క చేయకుండా రాష్ట్రంలో 13 జిల్లాలలోని 134 అసెంబ్లీ నియోజకవర్గాలు, 231 మండలాలు, 2,516 గ్రామాలు మీదుగా 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్ల మేర యాత్ర సాగిందని, కోట్లాది మంది ప్రజల హృదయాలను స్పృశిస్తూ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో 2019 జనవరి 9వ తేదిన ముగిసిందని తెలిపారు.

పాద యాత్రలో ఇచ్చిన హామీలనే ఎన్నికల మేనిఫెస్టోగా పెట్టి అందులో 97% హామీలను ఇప్పటికే నెరవేర్చిన ఘనత ప్రస్తుత ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి కే దక్కిందని అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీలో ప్రధానమైనది గ్రామల్లోనే పాలన.. ఈ నేపథ్యంలో గ్రామ సచివాలయాలు గ్రామ స్వరాజ్యసాధనేలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

గ్రామంలోనే ఉద్యోగాలు కల్పించారు. సచివాలయాల్లో శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక వాలంటీర్‌.. సేవలందించడానికి వచ్చారు. మళ్లీ పల్లెలకు కొత్త కళ వచ్చింది. గ్రామాలకు ఆస్తులు వచ్చాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు.. ఇలా ప్రతి గ్రామానికి విలువైన ఆస్తులు సమకూర్చబడ్డాయి. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, మహిళా సాధికారత, విద్యా దీవెన, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఇవన్నీ.. ప్రజా సంకల్ప యాత్రలో మొగ్గతొడిగినవే అని గుర్తు చేశారు..


SAKSHITHA NEWS