SAKSHITHA NEWS

హైదరాబాద్‌: రెండు లక్షల మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌.హెచ్‌.జి.) ఖాతాల్లోకి బ్యాంకర్లు రూ.217 కోట్లు జమ చేసినట్లు మంత్రి హరీశ్‌రావు మీడియాకు తెలిపారు. బ్యాంకులు గతంలో అధికంగా వసూలుచేసిన వడ్డీ సొమ్మును తిరిగి సంఘాల ఖాతాల్లో వేసినట్లు ఆయన వివరించారు. మహిళా సంఘాలు తీసుకునే రుణాలపై ఎంత వడ్డీ వసూలు చేయాలో… 2022 జూలై 20న బ్యాంకులకు ఆర్బీఐ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. రూ.3 లక్షల వరకు రుణంపై గరిష్ఠంగా 7శాతం, రూ.3 లక్షల నుంచి 5 లక్షల వరకు రుణంపై 10 శాతం వసూలు చేయాలని సూచించింది.

కొన్ని బ్యాంకులు ఈ నిబంధనను పట్టించుకోకుండా ఎక్కువ వడ్డీని వసూలు చేశాయని, ఒకే బ్యాంకు పరిధిలోని ఒక్కో శాఖలో ఒక్కో విధంగా వడ్డీ వసూలు చేస్తున్నట్లు హరీశ్‌రావు దృష్టికి వచ్చింది. బ్యాంకుల నిర్లక్ష్యంతో మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు అధిక వడ్డీ చెల్లించి నష్టపోతున్నారని ఆయన గుర్తించారు. 2022 డిసెంబర్‌ 23న జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి 35వ సమీక్ష సమావేశంలో వడ్డీ వసూళ్లపై మంత్రి సమీక్షించినప్పుడు రిజర్వ్‌ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారమే ఎస్‌.హెచ్‌.జి.ల రుణాలకు వడ్డీ రేటు అమలు చేయాలని ఆదేశించారు.

ఏ బ్యాంకులోనైనా నిబంధనలకు విరుద్ధంగా అధికంగా వసూలు చేస్తే ఆసొమ్మును వడ్డీతో చెల్లించాలని స్పష్టం చేశారు. బ్యాంకు అధికారులు సమీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 2,03,535 సంఘాల నుంచి రూ.217.61 కోట్ల మేర అధికంగా వడ్డీని వసూలు చేశారని తేలింది. అదనంగా వసూలు చేసిన ఈమొత్తాన్ని ఆయా సంఘాల ఖాతాల్లోకి సోమవారం జమచేశారు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాలతో 2లక్షల సంఘాలకు లబ్ధి చేకూరింది.


SAKSHITHA NEWS