అశ్వారావుపేట లో అంగన్వాడీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు
మోకాళ్ళపై కూర్చొని నిరసన
అశ్వారావుపేట (సాక్షిత న్యూస్) : అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26,000 చెల్లించాలని గ్రాడ్యుటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ పెంపు ఇతర సమస్యలు పరిష్కరించాలని అశ్వారావుపేట రింగ్ రోడ్డు లో అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ ధోరణికి నిరసనగా అంగన్వాడి ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అంగన్వాడి ఉద్యోగుల సంఘం నాయకులు రాధా, కృష్ణవేణి లు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్లుగా, ఆయాలుగా విశిష్ట సేవలు అందిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కనీసం గుర్తించకపోగా వెట్టి చాకిరి చేయించుకుంటుందని, అంగన్వాడీలకు సంబంధం లేని అనేక రకాల పనులను అంగన్వాడి టీచర్లతో ఎటువంటి అలవెన్స్ లేకుండా ప్రభుత్వం పని చేయించుకుంటుందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు.
అంగన్వాడీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 సంవత్సరాలకు పెంచడం విడ్డూరంగా ఉందని, ఇప్పటికే అనేక మంది అంగన్వాడీ టీచర్లు తమ పనులు తాము చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఇటువంటి సమయంలో రిటైర్మెంట్ కావాల్సిన వారి వయసును 65 సంవత్సరాలకు పెంచడం దారుణమని వెంటనే రిటైర్మెంట్ వయసు పెంపుదలను విరమించుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వీఆర్ఏలను, గ్రామపంచాయతీ సెక్రటరీ, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేసిన ప్రభుత్వం ఎన్నో ఏళ్లుగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడి ఉద్యోగుల పట్ల మానవీయ కోణంలో ఆలోచించి సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 చెల్లించాలని, గ్రాడ్యుటి అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడి టీచర్లకు 10 లక్షలు, హెల్పర్లకు 5 లక్షలు చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు చెల్లించాలని, ఎస్ఎస్సి అర్హత ఉన్న హెల్పర్లకు ప్రమోషన్స్ సౌకర్యం కల్పించాలని, మినీ అంగన్వాడి సెంటర్లను ను మెయిన్ సెంటర్లుగా గుర్తించాలని, అంగన్వాడీ టీచర్లకు 1500, హెల్పర్లకు 750, మినీ వర్కర్లకు 1250 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎరియర్స్ తో సహా చెల్లించాలని, మూడు సంవత్సరాల రేషన్ షాప్ రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని, ఇతర అన్ని రకాల సమస్యలు పరిష్కారం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరవధిక సమ్మెలో అంగన్వాడి ఉద్యోగులు రాజేశ్వరి ఉష విజయ, నాగలక్ష్మి, భాగ్యలక్ష్మి, ఆర్కేఎం లక్ష్మి, వాణి, ప్రవీణ, వెంకటరమణ, కుమారి, ప్రభావతి, లక్ష్మీ, సరోజినీ, అంబుజ్జి, సావిత్రి, వేదవతి, రాణి, ఆదిలక్ష్మి, ఉష, లక్ష్మి, కుమారి, నర్సమ్మ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.