తొమ్మిదేళ్ళ‌లో ఊహించని విధంగా విద్యాభివృద్ధిలో పురోగతి సాధించాం…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఘనంగా ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘…

‘రాగి జావా‘ అందించే కార్యక్రమం, డిజిటల్ క్లాస్ రూంలు ప్రారంభం…

ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ…

వివిధ పాఠశాలల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ‘తెలంగాణ విద్యా దినోత్సవం‘ ఘనంగా జరిగింది. కొంపల్లి, దూలపల్లి, బహదూర్ పల్లి, సూరారం, నిజాంపేట్, చింతల్ భగత్ సింగ్ నగర్ లలో ఏర్పాటు చేసిన విద్యా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూంలను ఎమ్మెల్యే స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ , నిజాంపేట్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న నోట్ & టెక్ట్స్ బుక్స్, ఒక్కొకరికీ రెండు జతల యూనిఫాంలను అందజేశారు. అనంతరం ‘రాగి జావా‘ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. విద్యా రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గత పాలకుల హయాంలో తరగతి గదులు లేక.. వరండాలు, చెట్ల నీడలో చదువులు, ఆరు బయట మధ్యాహ్న భోజనం, బెంచీలు లేక నేల బారు చదువులతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే వారని.. కానీ రాష్ట్రం ఆవిర్భవించాక మెరుగైన వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. దశలవారీగా మౌలిక వసతులు కల్పిస్తూ విద్యావిధానంలో పెను మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం 108 ప్రభుత్వ పాఠశాలలు, ఇందులో 21 ఉన్నత, 1 ప్రాథమికోన్నత, 86 ప్రాథమిక పాఠశాలలుండగా 2016-17లో వాటిలో 20,375 మంది విద్యార్థులుంటే, 2022-23లో ఆ సంఖ్య 24,735కు పెరిగిందన్నారు. 2014-15కు ముందు 10వ తరగతిలో నియోజకవర్గం మొత్తం మీద 30 శాతం ఉత్తీర్ణత ఉండేదని, నేడు ప్రణా ళికాబద్ధంగా విద్యాబోధన చేయించి, ఉదయం, సాయంత్రం వేళల్లో పునశ్చరణ తరగతులు నిర్వహిస్తు, విద్యార్థులకు అల్పాహారం ఉచితంగా అందిస్తుండటంతో 77 శాతం మేర ఉత్తీర్ణత సాధిస్తున్నారని అన్నారు. సూరారం కాలనీ, జగద్గిరిగుట్ట, కొంపల్లి పాఠశాలల్లో పలువురు విద్యార్థులు 10/10 జీపీఏ సాధించడం జరిగిందన్నారు. ఇవన్నీ ప్రభుత్వ బడుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం వల్లే సాధ్యమైందన్నారు. పిల్లల్లో పుస్తక పఠన నైపుణ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల్లో ‘ స్పీక్ ఏ బుక్ ‘ ప్రోగ్రామ్ పేరుతో ప్రతి పాఠశాలకు మొదటి బహుమతి కింద రూ.1000, రెండో బహుమతి కింద రూ.500 అందించడం జరిగిందన్నారు.

‘రూమ్ అండ్ రీడ్‘ ప్రోగ్రామ్ కింద గ్రంథాలయాలను ఏర్పాటు చేసి పుస్తకాలు సమకూర్చుతున్నామని అన్నారు. వివిధ సంస్థలు, కంపెనీల వారు సుమారు రూ.10 కోట్ల సీఎస్ఆర్ నిధులతో కార్పొరేట్ హంగులు కల్పించడానికి ముందుకు రావడంతో గాగిల్లాపూర్, గాగిల్లాపూర్ తండా, గాజులరామారం పాఠశాలలు అభివృద్ధి దిశగా ముందుకు సాగే అవకాశం లభించిందని అన్నారు. ప్రతి పాఠశాలలో ఆంగ్ల విద్యాబోధనకు శ్రీకారం చుట్టడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల వారి పిల్లలు కూడా ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారని అన్నారు. పాఠశాలల నిర్వహణకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు నిధులు అందజేస్తూ.. ప్రతి విద్యార్థికి ఉచితంగా రెండు జతల ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తున్నామని అన్నారు. 21 ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. “మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద 21 పాఠశాలల్లో రూ.3లక్షల నుంచి రూ.30 లక్షలు వెచ్చించి మౌలిక వసతుల కల్పనతోపాటు ఫర్నీచర్ సమకూరుస్తున్నామని పేర్కొన్నారు.

నియోజకవర్గంలో 2009లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు కాగా.. సొంత భవనం లేక అధ్యాపకులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని, దీనిపై ప్రత్యేక చొరవ చూపి మంత్రి కేటీఆర్ సహకారంతో బహదూర్ పల్లి అతిథి గృహం ఆవరణలో ఆవసరమైన స్థలం కేటాయింపజేయడం జరిగిందన్నారు. రూ.2.5 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరు చేయించి అన్ని హంగులతో నూతన భవనం నిర్మించి, సరిపడా అధ్యాపకులను నియమించడంతో విద్యార్థుల సంఖ్య 74 నుంచి 238కి పెరిగిందన్నారు. జూనియర్ కాలేజి ప్రాంగణంలో తన తండ్రి స్వర్గీయ శ్రీ కె.ఎం. పాండు గారి జ్ఞాపకార్థం రూ.కోటి విరాళంతో కె.ఎం. పాండు మెమోరియల్ గవర్నమెంట్ ఒకేషనల్ జూనియర్ కళాశాల రెండంతస్తుల భవనంను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అతి త్వరలోనే కళాశాలను ప్రారంభించుకోవడం జరుగుతుందన్నారు. అంతే గాక రాబోయే రోజుల్లో డిగ్రీ కాలేజీ, మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్, కమిషనర్లు శ్రీహరి, సత్యనారాయణ, రామకృష్ణ రావు, ఎంఆర్పీ రమేష్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, డివిజన్ల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page