SAKSHITHA NEWS

If dalitbandu gets… SC corporation loans bandh

దళితబందు పొందుతే… ఎస్సీ కార్పొరేషన్ రుణాలు బంద్

దరఖాస్తు వెబ్ సైట్ లో మార్పులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో దళితబంధు కింద లబ్ధిపొందిన కుటుంబాలను ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలోని ఇతర పథకాల నుంచి మినహాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌లో సాంకేతిక మార్పులు చేస్తోంది.

లబ్ధిదారుడి ఆధార్‌, రేషన్‌కార్డు సహాయంతో సాఫ్ట్‌వేర్‌ ద్వారా వడపోత ప్రక్రియ పూర్తిచేయనుంది. దళితబంధు పథకం కింద లబ్ధిదారులైన ఒక్కో ఎస్సీ కుటుంబానికి రూ.10లక్షల విలువైన యూనిట్‌ను సర్కారు మంజూరు చేస్తోంది. వీటి ద్వారా ఉపాధి పొంది ఆర్థిక సాధికారత సాధించాలన్నది లక్ష్యం.

ఈ పథకం కింద ఇప్పటివరకు 38,476 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో 90 శాతం యూనిట్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అందజేసింది. ఇప్పటి వరకు రూ.3,300 కోట్లకు పైగా ఈ పథకం కింద వెచ్చించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రస్తుతం ఎమ్మెల్యేల సిఫారసు మేరకు జరుగుతోంది.

దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో… లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సిఫారసు అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదికి నియోజకవర్గాలవారీగా లబ్ధిదారుల ఎంపిక నిలిచిపోయింది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక, దరఖాస్తుల స్వీకరణపై ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ఎస్సీ కార్పొరేషన్‌ సమాలోచనలు చేస్తోంది.

సాధారణంగా ఎస్సీ కార్పొరేషన్‌ కింద రాయితీ రుణాలు, ఇతర ఆర్థిక పథకాల కింద ఒకసారి లబ్ధిపొందిన కుటుంబాలకు అయిదేళ్ల పాటు తదుపరి ఎంపికలో అవకాశమివ్వరు. అదే విధంగా దళితబంధు పథకం కింద ఒకసారి లబ్ధిపొందిన వారికి, ఇక ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో అమలవుతున్న రాయితీ రుణాలు, ఇతర ఆర్థిక సహకార పథకాల కింద ఎంపిక చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.


SAKSHITHA NEWS