SAKSHITHA NEWS

History of Sri Dattatreya Swami, Avadhuta of Mogalicherla

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర…(మొదటి రోజు)

ఇది ఒక అవధూత చరిత్ర..

ఇది ఒక సాధకుడి జీవనయానం!..

1970 వ సంవత్సరం…

ప్రకాశం జిల్లా లో వలేటి వారి పాలెం మండలం లో గల మాలకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం..శ్రీ లక్ష్మీనారసింహుడు స్వయంభువు గా వెలసిన స్థలమది.. వారం లో ఒక్క శనివారం నాడు మాత్రమే, శ్రీ స్వామి వారికి అర్చనలు జరుగుతాయి..మిగిలిన ఆరు రోజులూ ఆ దేవాలయం మూసివేసి ఉంటుంది..కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న ఆచారమది..ఆరు రోజుల పాటు ఆ లక్ష్మీ నారసింహుడు ఋషులు, దేవతలచే పూజింపబడుతాడనీ.. ఒక్క శనివారం నాడు మాత్రం మానవ పూజ కు అర్హత ఉందనీ స్థల పురాణం..అక్కడి స్వామి వారిని “శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ” గా పిలుస్తారు..కొలుస్తారు..

ఆ మాలకొండ కు దక్షిణ దిశగా ఉన్న మొగలిచెర్ల వాస్తవ్యులు శ్రీ పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతులు..మొగలిచెర్ల లో వున్నవే నాలుగు బ్రాహ్మణ కుటుంబాలు..అందులో వీరి కుటుంబం ఒకటి..మొగలిచెర్ల గ్రామం లో నే కాకుండా చుట్టుప్రక్కల కూడా వీరి కుటుంబానికి మంచి పేరు ఉంది.

.

మాలకొండ దేవస్థానానికి శ్రీ శ్రీధరరావు ట్రస్టు బోర్డ్ అధ్యక్షుడిగా వుండేవారు..అదీకాక, ఆ దంపతులు మాల్యాద్రి లక్ష్మీ నారసింహుడికి భక్తులు..పవని నిర్మల ప్రభావతి ఆసరికే తెలుగులో రచయిత్రి గా పేరు తెచ్చుకుని వున్నారు..ప్రతి శనివారం ఆ దంపతులు క్రమం తప్పకుండా మాలకొండ కు వెళ్లి, ఆ స్వామిని దర్శించి వచ్చేవారు..మొగలిచెర్ల నుంచి, రెండెద్దుల తో కట్టబడిన గూడు బండిలో..తమతో పాటు మరో పదిమందికి ఆహారం ఇంటినుంచే తయారుచేసుకుని మాలకొండకు తీసుకు వెళ్లేవారు..మాలకొండ పైకి వెళ్ళడానికి ఆరోజుల్లో రోడ్డు సౌకర్యం లేదు..అందువల్ల, కొండ క్రిందనే తమ బండిని ఉంచి, దంపతులిద్దరూ మెట్ల మార్గం గుండా పైకి నడచి వెళ్లి, మళ్లీ సాయంత్రం కొండదిగి, తిరిగి ఇంటికొచ్చేవారు..

శ్రీధరరావు , మాలకొండ పైకి వెళ్ళడానికి రోడ్డు కొరకు అధికారులతో మాట్లాడి ఎటువైపునుంచి కొండమీదకు రోడ్డువేస్తే సౌకర్యంగా ఉంటుందో నని సర్వే చేయించే పనిలో, ఇతర రోజుల్లో మాలకొండకు వెళ్లసాగారు.

.

డిసెంబర్ నెలలో ఒకరోజు…శ్రీధర రావు మాలకొండ వెళ్లి, ఆ కొండలోనే కొద్దిగా దిగువున ఉత్తరంగా ఉన్న పార్వతీదేవి అమ్మవారి ఆలయం వద్దకు వెళ్లారు..పార్వతీ దేవి ఆలయానికి ఇంకొంచెం పైన కొండలోనే మలచబడ్డ శివాలయం నుంచి, మెల్లిగా దిగుతూ వస్తున్న ఒక దిగంబర యువకుడిని చూసారు..జన సంచారం లేని ఈ కొండమీద ఈ దిగంబర యువకుడెవరు?..శ్రీధరరావు కి సందేహం కలిగింది..ఇంతలో ఆ యువకుడు పార్వతీదేవి అమ్మవారి ఆలయం లోకి వెళ్ళిపోయి తలుపువేసేసుకున్నాడు..

శ్రీధరరావు గారికి కుతూహలం రెట్టింపు అయింది..కొండదిగి, అక్కడ వున్న స్థానికులను “మీరెప్పుడైనా అమ్మవారి ఆలయం దగ్గర దిగంబరంగా ఉన్న వ్యక్తిని చూసారా?” అని అడిగారు..ఈ మధ్య తాము కొండమీదకు వెళ్ళినప్పుడు అతను కనబడ్డాడనీ..తపస్సు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడని..పార్వతీదేవి అమ్మవారి ఆలయాన్ని తనకు నివాసంగా మార్చుకున్నాడనీ తెలిపారు..

“నిజంగా తపస్సు కోసమే ఇక్కడకు వచ్చాడా?..లేదా మరేదైనా ఆశించి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకున్నాడా?..” ఆ నిమిషంలో శ్రీధరరావు గారికొచ్చిన సందేహాలు..ఒక్కక్షణం కూడా ఆలస్యం లేకుండా శ్రీధరరావు గారు తిరిగి పార్వతీదేవి ఆలయం వద్దకు వెళ్లారు..తలుపు మూసి ఉంది..అక్కడే అరుగు మీద కూర్చున్నారు..పది, పదిహేను నిమిషాలు గడిచాయి..

తలుపుతీసుకుని, ఆ యువకుడు బైటకు వచ్చాడు..శ్రీధర రావు కి అప్పటిదాకా వేధిస్తున్న ఒక్క సందేహమూ మనసులో గుర్తులేదు..ఏమి అడగాలని అనుకున్నారో ఒక్క ప్రశ్న కూడా నోటినుంచి బైటకు రావడం లేదు..తానొక దిగంబర యువకుడి ఎదురుగా నిలుచున్నాననే స్పృహ కూడా లేదు..ఏదో మాయ!..ఏదో వింత అనుభూతి..ఇదీ అని చెప్పలేని మానసిక స్థితి..అలా మాన్ప్రడిపోయి నిలుచున్నారు..ఆ యువకుడు ఒక్క మాటా మాట్లాడలేదు..ప్రశాంతమైన చిరునవ్వుతో చూస్తున్నాడు..కొద్దిసేపటికి శ్రీధరరావు కి పరిసరాలు తెలిసివచ్చాయి..”మీరూ…” అని మాత్రం అనగలిగారు..

చేయెత్తి, ఒక్క క్షణం ఆగమన్నట్టు సైగచేసాడా యువకుడు..అమ్మవారి ఆలయం లోకి వెళ్లి ఒక చిన్న కాగితము, పెన్నూ తీసుకొని వచ్చి, “నేను ప్రస్తుతం మౌనం లో వున్నాను..సంక్రాంతి తరువాత మాట్లాడతాను..” అని వ్రాసి ఇచ్చాడు..శ్రీధరరావు నమస్కారం చేసారు.. అదే చిరునవ్వు!..అదే ప్రశాంతత!..కొద్దిసేపు అక్కడే నిలుచుండి.. ఇక తాను వెళ్ళొస్తానన్నట్లు గా తలా ఊపి.. అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోయాడు..శ్రీధరరావు గారు కొండ దిగి..రెండెడ్ల బండిలో తిరిగి మొగలిచెర్ల కు ప్రయాణమయ్యారు..

శ్రీధర రావు దంపతుల తో మాట్లాడటం..రేపు..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం.. SPSR నెల్లూరు జిల్లా..సెల్..94402 66380 & 99089 73699).


SAKSHITHA NEWS