మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర-2

Spread the love
History of Sri Dattatreya Swami, Avadhuta of Mogalicherla

మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..

(రెండవరోజు)

రాబోయే సంక్రాంతి పండుగ తరువాత తాను మౌనం వీడుతానని ఆ యువకుడు వ్రాసి చూపిన తరువాత..శ్రీధర రావు గారు తిరిగి మొగలిచెర్ల గ్రామానికి వచ్చేసారు..ఇంటికి రాగానే భార్య ప్రభావతి తో..తాను మాలకొండలో ఒక దిగంబర యోగిపుంగవుడిని చూశాననీ.. అతన్ని చూసిన మరుక్షణమే ఒక మహాత్ముడిని చూసిన అనుభూతి కలిగిందనీ.. ఈసారి తాను వెళ్ళేటప్పుడు..తనతో పాటు ఆమెను కూడా తీసుకెళతాననీ..ఎంతో ఉద్వేగంతో చెప్పారు..నిజానికి శ్రీధరరావు గారికి ఇంకా ఆ సాధకుడిని చూసినప్పుడు కలిగిన అనుభూతి వెంటాడుతూనే ఉంది..మాలకొండ నుంచి, మొఫలిచెర్ల దాకా ఎద్దులబండి లో దాదాపు రెండు గంటల ప్రయాణం చేసి వచ్చినా..ఆయన మనసంతా పార్వతీదేవి మఠం లో తాను ఆ సాధకుడి తో గడిపిన ఆ కొద్దిక్షణాల కాలమే గుర్తుకొస్తోంది..

శ్రీధరరావు గారు చెప్పిన మాటలు విన్న ప్రభావతి గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు..

“ఈరోజుల్లో.. యోగులు!..మహర్షులు!!..అయ్యోరామ!..ఎవడో వేషం వేసుకొని వచ్చి ఉంటాడు.. ..ఇదిగో మీ లాటి వాళ్ళను తెలివిగా బుట్టలో వేసుకొని..ఈ రకంగా నాలుగు డబ్బులు వెనకేసుకొని..వెళ్ళిపోతారు..వీళ్లంతా కాంతా కనకాలకు ఆశపడే వాళ్లే..నేను రాను!..మీరూ ఊరికే వెళ్లి అతన్ని కలవకండి!..ఏదో ఆ నరసింహ స్వామి దయవల్ల ఇలా హాయిగా బ్రతుకుతున్నాము..మనఇద్దరికీ పూర్వజన్మ సుకృతం వల్ల, ఆ లక్ష్మీనారసింహుడి సేవ చేసుకొనే అవకాశం వచ్చింది..కొండమీదకు ఆ రోడ్డు వేయిస్తే..ఎంతో మందికి స్వామిని దర్శించుకోవడం సులభం అవుతుంది..మీరు ముందాపని చూడండి..ఇటువంటి కుహనా యోగుల చుట్టూ తిరక్కుండా వుండండి.. మరోమాట..మనం సన్యాసులం కాదు..బాధ్యత గల సంసారులం..” అని సున్నితంగా కాదు గట్టిగానే చెప్పారు..

శ్రీధరరావు గారికి, ఆవిడ చేసిన ఈ బోధ రుచించలేదు..కాల,మాన పరిస్తితులనుబట్టి, ఆవిడ ఆవిధంగా ఊహించడంలో తప్పులేదు కానీ..అందరినీ ఒకే గాట కట్టటం తగదని ఆయన నచ్చచెప్పబోయారు..ప్రభావతి గారు చాలా సేపటి దాకా సమాధాన పడలేదు..
చివరకు..”సరే నండీ!..మీరంతగా చెపుతున్నారు కదా!..తరువాత చూద్దాం..ఎప్పుడో వీలున్నప్పుడు..” అని దాటవేశారు..
కానీ..శ్రీధరరావు గారు మాత్రం మాలకొండ కు వెళ్లినప్పుడల్లా..పార్వతీదేవి మఠం వద్దకు వెళ్లి, ఆ యోగి వచ్చేదాకా ఎదురుచూసి.. ఆయనను కలిసి రావడం ఒక నియమంగా పెట్టుకొని ఆచరించసాగారు..అలాగే..తాను ఆ యోగిని కలిసివచ్చిన తరువాత తన అనుభూతి ని ప్రభావతి గారితో పంచుకోవడమూ చేసేవారు..

శ్రీధరరావు గారు పదే పదే చెపుతున్న మాటల వల్ల కావొచ్చు..సహజమైన కుతూహలం వల్ల కావొచ్చు..తాను ఈసారి శ్రీధరరావు గారితో పాటు మాలకొండ వస్తానని ప్రభావతి గారు చెప్పేసారు..ఆ తరువాత రెండు మూడు రోజుల్లోనే సంక్రాంతి ఉంది..ఎలాగూ మౌన వ్రతం అయిపోతుంది కదా అని..ఆ దంపతులు పండుగ నాడు తమ గూడు బండిలో..మాలకొండకు ప్రయాణమయ్యారు..దారి పొడవునా..శ్రీధర రావు గారు ఆ యోగి గురించి చెపుతూనే వున్నారు..మాలకొండ క్రింద బండి ని ఆపేసి, బండితోలే అతనికి అక్కడే వుండమని చెప్పి..ఇద్దరూ పార్వతీదేవి మఠం వద్దకు మెట్లెక్కి వెళ్లారు..

సన్నగా వర్షం మొదలైంది..దంపతులిద్దరూ పార్వతీదేవి మఠం ముందున్న చిన్న పందిరిలో నిలబడి వున్నారు..అమ్మవారి ఆలయం తలుపులు వేసేసి ఉన్నాయి..ఆ యోగి ఆలయం లో ఉన్నాడా?..లేక వేరేచోటికి వెళ్లాడా?..అని ఆలోచిస్తూ నిలబడ్డారు..

ఇంతలో..పై నున్న శివాలయం గుహ వద్ద నుంచి..మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ యోగి, ఆ రాళ్ళ మధ్య నుంచి దిగి వస్తున్నాడు..నడుముదాకా వ్రేలాడుతూ..నీళ్లు కారుతున్న జుత్తు.. తెల్లటి మేని ఛాయ.. ఆరడుగుల శరీరం..చల్లటి చూపు..చిరునవ్వు తో కలిసిన విగ్రహం..ఒక చేతిలో దండము, మరో చేతిలో కమండలమూ..మొలకు కట్టుకున్న చిన్న అంగవస్త్రం తో దిగి వస్తున్నాడు..నేరుగా వచ్చి ఆ దంపతుల ముందు కొద్దిదూరంలో నిలుచున్నాడు..చేయెత్తి ఆశీర్వదిస్తున్నట్లుగా ఊపి..పార్వతీదేవి ఆలయం తలుపు తీసుకొని లోపలికి వెళ్లి..లోపలే ఉన్న చిన్న అరుగుమీద కూర్చుని ప్రక్కనే ఉన్న మరో చిన్న వస్త్రాన్ని అందుకుని..తెల్లటి పాదాలను తుడుచుకోసాగాడు..

శ్రీధరరావు గారు ముందుగా వెళ్లి..ఆయన పాదాలకు నమస్కారం చేశారు..చిరునవ్వుతో ఆశీర్వదించారు..ప్రభావతమ్మ కూడా నమస్కరించబోయింది..చటుక్కున తన పాదాలను వెనక్కు తీసేసుకున్నాడా యోగి..ప్రభావతి గారికి ఒక్కసారిగా మనస్సు చివుక్కుమనిపించింది..తనకు నమస్కారం చేసే అర్హత లేదా అనే ఒకానొక అహంకారపు ఆలోచన మనసులో తన్నుకొచ్చింది..

“నాయనా!..నిన్ను మొదటిసారిగా ఇదే నేను చూడటం ..నా భర్త గారు నమస్కరిస్తే..ఆశీర్వదించావు..అదే నేను నమస్కారం చేస్తే..తిరస్కరిస్తున్నావు..మేమిద్దరమూ సమానమే గదా..ఈలోపల నీకీ తేడా ఎందుకు?..” అని నేరుగా అడిగేసింది..

ఒక్కక్షణం పాటు ప్రభావతి గారిని నవ్వుతూ చూసి..తాను కూర్చున్న అరుగు మీదనుండి లేచి..పార్వతీ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి, భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి..ఆ అమ్మవారి విగ్రహం పాదాలవద్ద..ఈశ్వరుడు, పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉన్న ఈశ్వర కుటుంబం ఫోటో చూపి, అందులో ఉన్న పార్వతీదేవితో ప్రభావతి గారు సమానమనీ..తాను వినాయకుడితో సమానమనీ..తల్లి ఎప్పుడూ బిడ్డకు నమస్కరించరాదనీ…సైగలతో చెప్పి..మరలా పార్వతీదేవి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి..వచ్చి..అరుగుమీద కూర్చున్నాడు..

“అమ్మా!..ఈనాటితో నా మౌనం పూర్తి అయింది..ఇక మీతో మాట్లాడతాను!..” అన్నారా యోగి మొదటిసారిగా ఆ దంపతులతో..ఇద్దరూ ఆయన కూర్చున్న అరుగుకు అభిముఖంగా పద్మాసనం వేసుక్కూర్చున్నారు..సాక్షాత్ దక్షిణామూర్తి తమ ఎదురుగా ఉన్న అనుభూతి కలిగిందా దంపతులకు!..

ఆదిత్య హృదయం అప్పజెప్పడం..స్వామి వారి బోధ..రేపు..

సర్వం..
శ్రీ దత్తకృప!.

(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523 114.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page